ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే అర్థం కూడా ఏమిటో తెలియని పరిస్థితిల్లోకి వెళ్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినా.. బోటు మునక ఘటన చోటు చేసుకున్నా.. చివరికి… ఓ దుర్మార్గుడు కామంతో కళ్లుమూసుకుపోయి ఆకృత్యానికి పాల్పడినా… దానికి నేరుగా చంద్రబాబుకే ముడిపెట్టకపోతే ఆయనకు మనసు ఒప్పుకోవడం లేదు. గోదావరిలో మునిగిన లాంచీ ప్రమాదంలో అత్యంత విషాదకరం. ఈ విషయంలో ప్రకృతి కొంచెం పగబడితే.. లాంచీ డ్రైవర్.. పూర్తి నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలకు ఎసరు పెట్టారు. ఇదేం టూరిజం బోటు కాదు. ప్రభుత్వానికి సంబంధం లేదు. పైగా ఇప్పుడిప్పుడే నడుపుతున్నది కాదు. దశాబ్దాలుగా.. గోదావరిలో ఇలాంటి లాంచీలు ప్రయాణిస్తూనే ఉంటాయి. గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలకు.. సరుకుల్ని, ప్రజల్ని రవాణా చేస్తూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలకు ఎలాంటి నిర్లక్ష్యాలు కారణమవుతాయో.. బోటు ప్రమాదాలు కూడా అంతే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇవి ప్రభుత్వ హత్యలుగానే కనిపించాయి. వెంటనే అదే మాట అనేశారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ప్రమాదాలన్నింటినీ గుర్తు చేసి.. అవన్నీ వైఎస్ ప్రభుత్వం చేసిన హత్యలా అని ప్రశ్నించింది. అంతకన్నా అల్టిమేట్ పంచ్ కూడా ఇచ్చింది. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టరే ప్రమాదంలో కూలిపోయింది… మరి దీన్ని వైఎస్ తనకు తానుగా హత్య చేసుకున్నట్లా.. అని ప్రశ్నించడంతో వైసీపీ నేతలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదే సమయంలో వారణాశిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ దెబ్బకు ఇరవై మంది చనిపోయారని.. దీన్ని ప్రధాని మోదీ చేసిన హత్యలు అనగలవా అని టీడీపీ చాలెంజ్ చేసింది. వీటికి వైసీపీ నుంచి రిప్లయ్ లేదు.
రాజకీయాలుంటే… అధికారపక్షం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడం ఓ విధానం. అందులో మంచిచెడ్డలు వెదికి చెప్పడం మరో విధానం. కానీ ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం దగ్గర్నుంచి… ప్రమాదాల వరకూ ప్రతీదానికి ప్రభుత్వానికో..ముఖ్యమంత్రికో ముడిపెడుతూ పోతూంటే.. రాను రాను సీరియస్ నెస్ కరవవుతుంది. రేపు నిజంగానే ప్రభుత్వ వైఫల్యం ఉన్న ఘటన ఏదైనా బయటపడితే…ప్రతిపక్ష నేత ఆరోపణలను ప్రజలు లైట్ తీసుకుంటారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావడం లేదు. చెప్పేవారు కూడా లేరు. చెప్పే వినే పరిస్థితిలో కూడా ఉండరని వైసీపీ నేతలు చెబుతూంటారు. ఆయన మార్క్ రాజకీయం అనుకుని చూస్తూ ఉండిపోవాల్సిందే.. !