కర్ణాటక రాజకీయ పరిణామాలతో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంతో ప్రమాదకర ఆట ఆడుతోందని స్పష్టమవుతోంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం కానీ… గత నాలుగేళ్లలో నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం రూపొందించిన అలిఖిత నిబంధనల ప్రకారం చూసినా… కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామికి ముందుగా అవకాశం ఇవ్వాలి. గోవా, మేఘాలయ, మణిపూర్‌లలో ఏం జరిగిందో.. కర్ణాటకలోనూ అదే జరింది. కానీ బీజేపీ మాత్రం ఇక్కడ ప్రాధాన్యాలు మార్చేసింది. కోర్టులు కూడా కల్పించుకోలేనంత వేగంగా రాజకీయ పరిణామాలు ముగించేయాలనుకుంది. ఫలితలొచ్చిన 36 గంటల పాటు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ రాత్రి తొమ్మిది గంటలకు యడ్యూరప్పను ఆహ్వానించారు. నిజానికి అధికారిక ప్రకటన బయటకువచ్చేసరికి పది అయింది.తమను గవర్నర్ ఆహ్వానించారని బీజేపీ నేతలు ఎనిమిదిన్నర నుంచే సోషల్ మీడియా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు కపిల్ సిబల్, చిదంబరం ఢిల్లీలో అత్యవసర ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి వచ్చింది.
రాత్రి పది గంటలకు.. యడ్యూరప్పను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం.. ఉదయం తొమ్మిది గంటలక కల్లా ప్రమాణస్వీకారం చేయాలనడం వెనుక… బీజేపీ నైతికత లేని రాజకీయాలు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణస్వీకారం పూర్తి చేయాలనే ప్లాన్ అమలు చేసింది. అంటే.. ఈ మధ్యలో కోర్టుకు వెళ్లే చాన్స్ కాంగ్రెస్‌కు ఉండదని ప్రమాణస్వీకారం పూర్తయిపోతుందని.. ఆ తర్వాత కోర్టులు ఏమీ చేయలేవని.. అమిత్ షా, మోదీ, భావన కావొచ్చు. కానీ అనూహ్యంగా సుప్రీంకోర్టు అర్థరాత్రి దాటిన తర్వాత తలుపు తట్టినా స్పందించింది. ఉన్న పళ్లంగా కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసి.. తెల్లవారేవరకూ వాదన విన్నది. ఇంకా వ్యవస్థలు అంతో ఇంతో… పని చేస్తున్నాయన్న ఆశలు కల్పంచేలా చేసింది.
న్యాయవ్యవస్థ వేగంగా స్పందించినా… గతంలో ఉన్న తీర్పు, ప్రభుత్వాలు ఏర్పడిన తీరు, గవర్నర్ల వ్యవహారశైలిని పరిశీలిస్తే… కాంగ్రెస్, జేడీఎస్‌లకు సుప్రీంకోర్టు నిర్ణయం నిరాశ కలిగించినట్లే. గవర్నర్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవన్న సాంకేతిక వాదనతో యడ్యూరప్ప ప్రమాణానికి బీజేపీ ఇబ్బంది లేకుండా చేసుకుంది. కోర్టులో జరిగిన వాదనల్లో మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ బీజేపీకి మద్దతుగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదేమైనా యాకుబ్ మొమన్ ఉరి తీత కేసా… ఏంటి ఇంత హడావుడిగా అర్ఱరాత్రి విచారణ చేపట్టడానికి అంటూ సెటైర్లు వేశారు. కానీ…ఇది యకూబ్ ఉరితీత కేసు కాదు.. కానీ అలాంటిదేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అక్కడ యాకూబ్‌ను ఉరి తీశారేమో కానీ.. ఇక్కడ భారత ప్రజాస్వామ్యాన్ని బలిపీఠంపై పెట్టారు. ఏ ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని అనుభవిస్తున్నారో.. దాని అస్థిత్వాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు. అందుకే న్యాయవ‌్యవస్థ కొద్దిగా అయినా చలించింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది కదా అని చాలా మంది చరిత్రను ముందు వేసుకుని బీజేపీ చేస్తోంది సమంజసమేనని వాదించేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే గతంలో కోర్టు తీర్పులు చాలా గవర్నర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కోర్టుల కళ్లకు కూడా గంతలు కట్టేసే పరిస్థితి వచ్చింది. రాత్రికి రాత్రే ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పే కాలం వచ్చేసింది. కానీ ప్రజాస్వామ్యంతో ఆటలాడితే.. అది చివరికి.. ఆయా పార్టీలకే పెను ప్రమాదంగా మారుతుంది కానీ… భారత డెమోక్రసీకి కాదు. ఈ విషయం కాంగ్రెస్‌ను చూస్తే తెలుస్తుంది. తర్వాత బీజేపీ ప్రత్యక్ష ఉదాహారణ కావొచ్చు.