కర్ణాటకలో భారతీయ జనతాపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వందల కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని.. రకరకాలుగా మాటల తూటాలు నేరుగా బీజేపీకి తగులుతున్నాయి. కానీ ఇంత దారుణమైన ఇమేజ్ తెచ్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్న ప్రచారం ఉంది. అందుకే బీజేపీ మూడు మార్గాలను రెడీ చేసి పెట్టుకుంది.
బీజేపీ దగ్గర పెట్టుకున్న మొదటి అస్త్రం… ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చూడటం. ప్రస్తుతం అసెంబ్లీలో 222 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 104 మంది సభ్యులున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మెజార్టీలోకి రావాలంటే.. అసెంబ్లీకి 207 మంది ఎమ్మెల్యేలు హాజరైతే చాలు. అంటే పదిహేను మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బీజేపీ చేయగలిగితే.. యడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కుతుంది. ఎమ్మెల్యేలను… కొన్నారన్న విమర్శలు కొంత వరకు తగ్గుతాయి.
ఇది సాధ్యం కాకపోతే… వాజ్ పేయి తరహాలో… అసెంబ్లీలో గంభీరంగా ప్రసంగించి… పదవికి రాజీనామా చేయడం. గతంలో 1996లో వాజ్పేయి మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎన్డీఏకు బలం లేదు. కానీ ఇతరులెవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విశ్వాస తీర్మానంపై చర్చ పెట్టారు. అందులో గంభీరంగా మాట్లాడిన వాజ్పేయి తన ఉద్దేశాలను ప్రజలకు .. వివరించారు. ఆ తర్వాత ఓటింగ్ జరగకుండానే రాజీనామా చేశారు. దాంతో వాజ్ పేయికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు యడ్యూరప్ప అదే చేయవచ్చు.
ఇక మూడో ప్లాన్ నేరుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే. ఇలా చేస్తే బీజేపీ తన పతనాన్ని తాను నేరుగా కొని తెచ్చుకున్నట్లే. ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నది ఎన్నికల వరకూ పనికొస్తుందేమో కానీ.. నేరుగా ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపే ఇలాంటి విషయాల్లో మాత్రం బీజేపీకి ఇప్పటికప్పుడు కాకపోయినా భవిష్యత్లో అయినా సమస్యలే.