తెలుగు బీజేపీ నేతలకు ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకహోదా సెగ వదలడం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైన తెలుగు వ్యక్తి జీవీఎల్ నరసింహావు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి తెలుగు సంఘాలతో సమావేశమవుతున్నారు. న్యూజెర్సీలో ఇలా ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎల్ నరసింహారావును తెలుగు ప్రజలు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన మోసంపై నిదీశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి కారణాలేమిటని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో జీవీఎల్‌కు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయారు.
న్యూజెర్సీలో బీజేపీ సానుభూతి పరులే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక విజయంతో.. సంబరాలు జరుగుతాయనుకున్న జీవీఎల్‌కు ఎక్కువగా నిరసనలే ఎదురయ్యాయి. జీవీఎల్ తన ప్రసంగంలో ఎక్కువగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమేం ఇచ్చిందో ఏకరవు పెట్టే ప్రయత్నం చేశారు. లక్షల కోట్లు ఇచ్చిందని లెక్కలు చెప్పడం ప్రారంభించారు. దీంతో అవి వింటున్న తెలుగువారిలో అసహనం పెరిగిపోయింది. రాజ్యాంగ పరంగా పన్నుల్లో వాటాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు కాకుండా.. మిగతావి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నీ అబద్దాలే చెబుతున్నారని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో జీవీఎల్ ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
ఈ సమావేశానికి జీవీఎల్‌తో పాటు రామ్‌మాధవ్ కూడా హాజరవ్వాల్సి ఉంది. కానీ కర్ణాటక రాజకీయ పరిణామాలు, తల్లి మరణంతో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. ఎంపీగా ఎన్నికైన తర్వాత జీవీఎల్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబుపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఏపీకి మోదీ ఎంతో చేశారని… చెప్పుకొస్తున్నారు. దక్షిణాదిపై దండయాత్ర చేస్తామని బెదిరిస్తున్న తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీకి కొద్ది అనుకూలంగా వస్తున్న సమయంలో… ఏపీలో అదరహో అనిపిస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో జీవీఎల్‌కు అలాంటి పరిస్థితే ఎదురైందని సైటైర్లు పడుతున్నాయి.