జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్.. కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారు. గతంలో బీజేపీ నేత అయిన అద్దేపల్లి శ్రీధర్ తాను.. జనసేన నేత అనే సంగతిని మర్చిపోయినట్లు ఉన్నారని.. పక్కనున్న నేతలు పరోక్షంగా ఎగతాళి చేస్తున్నా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జనసేన అధికార ప్రతినిధి హోదాలో.. బీజేపీ వాయిస్‌ని వినిపించేందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. పైగా తమ పార్టీ విధానం అదేనన్నట్లుగా ఆయన నేరుగా జనసేనను ఇరికించేస్తున్నారు.
రాజకీయ పార్టీగా … దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రతి పార్టీకి ఓ విధానం ఉంటుంది. జనసేనకు కూడా ఉంటుంది. ఇదే జనసేన విధానమైతే పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేస్తే దానికి క్రెడిబులిటీ ఉంటుంది. కానీ ఓ పార్టీ అధికారప్రతినిధి.. మరో పార్టీ చేస్తున్న పనులను…కుండబద్దలు కొట్టినట్లు సమర్థించడం ఇటీవలి కాలంలో చూడలేదు. అవి మిత్రపక్షాలైనప్పటికీ.. అంత ఏకపక్షంగా సమర్థించడం చూసి ఉండం. విచిత్రం ఏమిటంటే..అధికారికంగా ఇప్పటికీ బీజేపీ-జనసేన మిత్రపక్షాలు కాదు.
అల్ప సంఖ్యాకుల వాయిస్‌ని జనసేన వినిపిస్తుందని.. పవన్ పదే పదే చెబుతూంటారు. అదే నిజమైతే.. కర్ణాటకలో బీజేపీ తీరును తీవ్రంగా ఖండిస్తారు. పవన్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీన్నే అద్దేపల్లి శ్రీధర్ అడ్వాంటేజ్‌గా తీసుకుని.. తన రాజకీయ భవిష్యత్ కోసం పునాదులు వేసుకుంటున్నారని..జనసేనను బలి చేస్తున్నారన్న అభిప్రాయాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీ విధానాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేయలేకపోతూండటంతో..దాన్ని ఆధారంగా చేసుకున్ని అద్దేపల్లి శ్రీధర్ లాంటి నేతలు చెలరేగిపోతున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.
కర్ణాటక పరిణామాలపై దేశవ్యాప్తంగా.. ఒక్క బీజేపీ మినహా మరే పార్టీలు సానకూలంగా లేవు. ఎన్డీఏ పార్టీలు కూడా… అసంతృప్తిలో ఉన్నాయి. శివసేన నేరుగా విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి సమయంలో.. బీజేపీని నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం ఏమిటని.. జనసేన వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వ్యూహకర్త దేవ్, అధికారప్రతినిధి అద్దేపల్లి ఇద్దరూ కలిసి.. జనసేనను బీజేపీకి బీ టీంగా చేస్తున్నారనే అనుమానాలు ఆ పార్టీ కార్యకర్తల్లో ఏర్పడుతున్నాయి.