కర్ణాటక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంటూ ఓ వారంపాటు అందరూ తలలుబాదుకున్నారు! కాసేపు కాంగ్రెస్ అన్నారు, తరువాత హంగ్ అన్నారు, భాజపా వచ్చే అవకాశాలున్నాయన్నారు! మీడియా సంస్థలూ సర్వేలూ రాజకీయ విశ్లేషకులూ రకరకాల అంచనాలూ లెక్కలు పడిగట్టారు. కానీ, ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముందే అడిగి ఉంటే సరిపోయేదేమో! ఎందుకంటే, ఆయనకి నెల రోజుల ముందే తెలుసట.. కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నది భాజపాయే అని! ఆ మాట ఆయనే స్వయంగా చెప్పారు.
తాను చాలామంది అధికారులను నెలరోజుల కిందట కలుసుకున్నాననీ, కర్ణాటకలో భాజపా అధికారంలోకి వస్తుందని తనకు ‘వారు చెప్పారని’ చెప్పారు! సీట్ల సంఖ్య ఎవరికి ఎలా వచ్చినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీయే అని వారు పవన్ కి చెప్పారట. ఎలా అంటే, వారి విధానాలు వారికి ఉంటాయని చెప్పారన్నారు. ఆ విధానాలేంటో అందరికీ తెలుసు అన్నారు. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది సరైన విధానమా కాదా అంటే… దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవ్వరూ లేరని పవన్ చెప్పారు. ఎందుకంటే అందరిలోనూ లోపాలున్నాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరుగారుస్తూ ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం భాజపా చేస్తోంది కదా.. దీనిపై ఏమంటారని పవన్ ని అడిగితే, ‘ఇది ఒక్క భారతీయ జనతా పార్టీయే కాదు, అన్ని పార్టీలూ చేస్తున్నదే. టీడీపీ, వైయస్సార్ సీపీలు కూడా చేస్తున్నాయి’ అని తేల్చేశారు!
అంతేతప్ప, ప్రస్తుతం కర్ణాటక జరుగుతున్న రాజకీయ క్రీడను ఖండిస్తున్నట్టు సూటిగా చెప్పలేదు. ఈ విధానాన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవ్వరూ లేరనీ తేల్చేశారు! ఏం… జనసేన తరఫున పవన్ ప్రశ్నించొచ్చు! ప్రశ్నించడానికే పుట్టిన పార్టీయే కదా! అన్నిటికీమించి.. వైకాపా, టీడీపీల మాదిరిగా ఫిరాయింపు నేతలు జనసేనలో లేరు. భాజపా చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలను సూటిగా ప్రశ్నించడానికి ఇంతకుమించిన అర్హత ఏముంటుంది..? ఇంకోటి… కర్ణాటకలో భాజపా అధికారంలోకి వస్తుందని ‘ఎవరో చెబితే’ ముందే తెలిసిందని మళ్లీ చెబుతున్నారు. ఇలా ‘ఎవరో చెబితే’ అనే ప్రిఫిక్స్ ఉపయోగించి గతంలో కొన్ని ఆరోపణలు చేసినందుకే విమర్శలపాలయ్యారు. ఇంకా ఈ ‘ఎవరో’ అనే సోర్స్ మీద ఆధారపడే విషయాలు తెలుసుకుంటున్నట్టున్నారు. నిజానికి, కర్ణాటకలో భాజపా ఇంకా పూర్తిగా అధికారంలోకి వచ్చెయ్యలేదు. ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్ప ప్రమాణస్వీకారం మాత్రమే చేశారు. బలనిరూపణ జరగాల్సి ఉంది.