దళితుల పట్ల బిజెపి వైఖరి ఏమిటన్న విషయం మీద దేశవ్యాప్త చర్చకు రోహిత్ ఆత్మహత్య తెరతీసింది.
అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలతో ఘర్షణ పడిన దళిత విద్యార్థులను జాతి వ్యతిరేకులు, తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ కేంద్రమంత్రి దత్తాత్రేయ రాసిన లేఖ, దానిపై కేంద్ర మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ శాఖ యూనివర్సిటీకి పంపిన ఆరు రిమైండర్లు, దానిపై యూనివర్సిటీలో రోహిత్ తదితరులకు వైస్ చాన్సలర్ అప్పారావు ఆధ్వర్యంలో సాంఘిక బహిష్కరణగా సస్స్పెన్షన్ శిక్ష …అనంతరం రోహిత్ ఆత్మహత్య..మొదలైన పరిణామాలు సామాజిక సంబంధాల్లో అధికార బిజెపి పాత్రను అనుమానాస్పదంగా నిలబెట్టాయి.
ఈ ఒక్క సంఘటన వల్ల మాత్రమే బిజెపిని అనుమానించనవసరం లేదు. రిజర్వేషన్‌లపై పున:పరిశీలన జరగాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ చేసిన వ్యాఖ్యానాలు,ఫరిదాబాద్‌లో సజీవదహనమైన దళిత చిన్నారులను కుక్కలతో పోల్చిన కేంద్రమంత్రి వీకే సింగ్ అమానుష వ్యాఖ్యానాలు…మరో పక్క.. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం, దళిత పారిశ్రామికవేతల సమావేశం నిర్వహించడం.. బీజేపీ లో దళితుల పట్ల అంతర్గత వైరుద్ధ్యాల్ని బయట పెడుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే రోహిత్ ఆత్మహత్య సంఘటన జరిగింది. ఈ వ్యవహారంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు సంజరు పాశ్వన్ ట్విటర్‌లో స్పందించారు. “కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేదంటే తీవ్ర ఆగ్రహం, ప్రతీకారం, తిరుగుబాటు, ప్రతిస్పందనలు ఎదుర్కోడానికి సిద్ధపడాలి,” అని స్పష్టం చేశారు. దళిత వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యాస్థాయికి చేరుకోవాలంటే ఎంత కష్టమో, అనంతరం ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా ఉంటుందో ఓ దళితుడిగా తాను అర్ధం చేసుకోగలనని ఆయన అన్నారు.
బీజేపీ సిద్దాంతకర్త, ఆపార్టీ సోషల్ ఇంజనీరింగ్ రూపకర్త గోవిందాచార్య “ఇది సంఘ్ పరివార్ లో సిద్దాంత వైరుధ్యం”గా అభివర్ణించారు. “వెనుకబడిన కులాలు, దళిత వర్గాల మధ్యనుంచే నాయకత్వం బలపడినప్పటికీ ఆ వర్గాలకు పార్టీ నాయకత్వం దూరంగా వెళ్లిపోయింది,” అని గతంలో గోవిందాచార్య విశ్లేషించారు.
‘హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగినది దళితులు, ఏబీవీపీ మధ్య సమస్య కాదు. ఒకరకమైన దళిత చైతన్య రాజకీయాలకు, వాటితో ఏ మాత్రం ఏకీభవించలేని సంఘ్‌పరివార్ శక్తులకు మధ్య జరిగిన ఘర్షణ ఇది,’ అని సామాజికవేత్త బద్రినారాయణ్ విశ్లేషించారు.