ఒక వైపు డబ్బు, మరో వైపు అధికారం .. ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఈ రెండు చాలు. ఈ రెండింటిని సమర్థంగా వాడుకునే మేనేజర్లు బీజేపీలో ఉన్నంత కాలం .. ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందన్న లెక్క ఉండదు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. అయితే గోవా, మణిపూర్ రాష్ట్రాల లెక్క వేరు. కర్ణాటక లెక్క వేరు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుటుందని అందరూ నమ్ముతున్నారు. నిజంగా నిలబెట్టుకుంటే.. బీజేపీ శ్రేణులు కాసేపు హడావుడి చేయవచ్చు కానీ.. ఇది కచ్చితంగా ఆ పార్టీ పతనానికి నాందే.
బీజేపీ బలపరీక్షలో నెగ్గితే.. అధికార దుర్వినియోగం చేశారన్న ముద్ర బలంగా పడుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పొందడంలోనే.. కుట్ర చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇపుడు విశ్వాస పరీక్షలో బలం లేకున్నా గెలిస్తే సానుకూల భావన ఎలా వస్తుంది. దేశంలోని వ్యవస్థలన్నింటినీ బీజేపీ భ్రష్టు పట్టించారన్న ఆగ్రహం ప్రజల్లో పెరిగిపోతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించి గెలిచారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. యడ్యూరప్ప నెగ్గిన వెంటనే… బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలున్న చోట అలజడి పెరుగుతుంది. మా సంగతేంటని మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు గవర్నర్ వద్దకు క్యూ కడతాయి. రేపు కొత్తగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరిగితే..అతి పెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుంది.
బీజేపీ, మోదీ విధానాలపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీపై పోరాటం విపక్ష పార్టీలు అన్ని ఒక్కటవుతాయి. 2019 ఎన్నికల్లో ఈ పరిణామాలు మోదీకి వ్యతిరేకభావన పెరిగిపోతుంది. దాన్ని ఆపడానికి ఏం చేసినా ప్రయజనం ఉండదు. ఇప్పటికే.. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలవడం ఏర్పడిన … నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ తంటాలు పడుతుంది.ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితే. అందుకే కర్ణాటకలో బీజేపీ గెలిస్తే.. పీఠం అందుతుందేమో కానీ.. భవిష్యత్ లో ఢిల్లీ పీఠం కదిలిపోయే అవకాశం ఉంది.