కర్ణాటక ఫలితాలు, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న డ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత సింపథీని పొందే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ విలువలకు భాజపా అడ్డగోలుగా పాతరేస్తోందని అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ లో ఇలాంటి రాజకీయాలు జరుగుతాయనీ అనేశారు. ఈ పరిస్థితినే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో చేస్తున్న డ్రామాలకు భాజపా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది, అది వేరే విషయం. అయితే, భాజపా చేస్తున్న రిసార్ట్ రాజకీయాలపై కాంగ్రెస్ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితే కాస్త వింతగా కనిపిస్తోంది. ఎందుకంటే, అది వారు నేర్పిన విద్యే కదా! ఇవాళ్ల భాజపా చేసిన పనే.. గతంలో కాంగ్రెస్ చాలాసార్లు చేసింది. కాకపోతే, ప్రస్తుతం కర్ణాటకలో భాజపాకి అలాంటి అవకాశం వచ్చిందంతే..! కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా కర్ణాటకలో అవతరించలేదు కాబట్టి, ఇప్పుడీ ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది.
భాజపా రిసార్ట్ రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ ఇప్పుడు వేలెత్తి చూపుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తక్కువేం కాదు కదా! గత జులైలో గుజరాత్ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించారు కదా! గుజరాత్ లో పరిస్థితులు సరిగా లేవనే కారణం నాడు చూపారు. 1996లో గుజరాత్ లో భాజపాను చీల్చేందుకు కాంగ్రెస్ కూడా ప్రస్తుత తరహా రాజకీయాలే చేసింది. అప్పుడు కూడా మిత్రపక్షం జేడీఎస్ తో కలిసి రాజకీయం చేయడం విశేషం. భాజపా రెబెల్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలాను ప్రోత్సహిస్తూ, కొంతమంది భాజపా ఎమ్మెల్యేలను కజురహోకి పంపింది. ఆ తరువాత అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో… గుజరాత్ లో భాజపా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తూ అప్పటి ప్రధాని దేవెగౌడ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క దేవెగౌడ హయాంలో మాత్రమే కాదు, అంతకుముందు చరణ్ సింగ్ జమానాలో కూడా ఇలాంటి రాజకీయాలే కాంగ్రెస్ చేసింది.
ప్రస్తుత పరిస్థితిని అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ బీహార్, గోవాలలో కూడా అత్యధిక స్థానాలు దక్కించుకున్న తమకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ని కాంగ్రెస్ వినిపిస్తోంది. ఇంకోపక్క, కర్ణాటకలో తమ పట్టు నిలుపుకోవడం కోసం ఒక ప్రాంతీయ పార్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని రాహుల్ గాంధీ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఇది. తమ అస్థిత్వ ఏంటనేది ప్రశ్నించుకోవాలి.