జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. దీంతోపాటు, జనసేనకి కొత్త కేడర్ ఉత్సాహం కూడా తోడు కాబోతోందా..? అంటే, అవుననే అనిపిస్తోంది..! ఇంతకీ, కొత్త కేడర్ అంటే ఎవరు..? ఎక్కడి నుంచి రాబోతున్నారు..? ఇప్పుడే ఎందుకు రాబోతున్నారు…? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం… కాంగ్రెస్ పార్టీ! అవునండీ… పవన్ బస్సుయాత్ర విజయవంతం అయ్యేందుకు ఏపీలోని సుప్తచేతనావస్థలో ఉన్న కాంగ్రెస్ కేడర్ మద్దతు లభించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమైందంటే… ఒక కాంగ్రెస్ నేత రాయబారం ద్వారా అని చెప్పొచ్చు.
ఉత్తరాంధ్ర యాత్రలో భాగంగా విశాఖలో ఉంటున్న పవన్ కల్యాణ్ తో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంత్ కుమార్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్యా చాలా కీలకమైన విషయాలు చర్చకు వచ్చినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వట్టి ఒక ఆఫర్ ను పవన్ ముందుంచారని తెలుస్తోంది. కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని కూడా చెప్పినట్టు సమాచారం.ఈ ఆలోచన బాగుందని పవన్ స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై తాను ఆలోచిస్తాననీ, ఒక నెల సమయం కావాల్సిందిగా పవన్ కోరినట్టు కూడా సమాచారం..!
దీని ద్వారా వెలువడుతున్న సంకేతాలు ఏంటంటే… దక్షిణాదిలో కాంగ్రెస్ మరింత యాక్టివ్ అయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టిందని..! నిజానికి, పవన్ కల్యాణ్ ను భాజపా ప్రోత్సహిస్తోందనీ, ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయనను తమ దగ్గరకు చేర్చుకుంటుందనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటే… దక్షిణాదిలో భాజపా పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పినట్టు. ఇప్పటికే, దక్షిణాదిలో చూసుకుంటే.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కేరళలో భాజపా ప్రభావం అంతగా లేదు. అవకాశం ఉన్న కర్ణాటకలో కూడా స్వయంకృతాపరాధంతో నిలువునా పరువు పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ కొంత అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
ఇక, ఆంధ్రాలో పవన్ కు తోడుగా కాంగ్రెస్ కేడర్ కలిస్తే, అనూహ్యమైన స్పందనకు ఆస్కారం ఉందా అంటే.. అదీ చెప్పలేని పరిస్థితి. ఎలా అంటే, ఇంతకీ కాంగ్రెస్ కు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కేడర్ ఏంటనేదే అసలు ప్రశ్న..? రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ రాష్ట్రంలో భూస్థాపితమైపోయింది. కేడర్ లో సింహ భాగం వైకాపాకి షిఫ్ట్ అయింది. వైయస్సార్ పాలన క్రెడిట్ ను జగన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ హయాంలో జరిగిన పాలనగా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఇప్పటికీ పార్టీ విఫలమౌతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కు కాంగ్రెస్ మద్దతు అనగానే.. వేలు విడిచిన కేడర్ కు కొత్త ఉత్సాహం వస్తుందా లేదా అనేది చూడాలి. ఇదే సందర్భంలో, కాంగ్రెస్ కి పవన్ దగ్గరౌతున్నారంటే.. ప్రజారాజ్యం మాదిరిగానే జనసేన భవిష్యత్తూ విలీనమేనా అనే విమర్శలను బలంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.