భారతీయ జనతా పార్టీ తీరును భారతదేశమంతా ఒకలా అర్థం చేసుకుంటే… ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మరోలా అర్థం చేసుకుంటారు..! దాన్ని ఇంకోలా అర్థమయ్యేట్టు చెబుతారు. ఏది ఎలా చెప్పినా… ఆ పార్టీ మీద తమదైన విమర్శలు ఆయన సూటిగా చెయ్యరు. కర్ణాటకలో అడ్డగోలుగా కొనుగోలు రాజకీయాలు జరిగితే… ‘అలాంటి ఆరోపణలు వచ్చాయి’ అని మాత్రమే అంటారు. కర్ణాటకలో భాజపా భంగపాటు అనంతరం జగన్ ఒక ట్వీట్ పెట్టారు. అదేంటనేది ముందుగా చూద్దాం.
కర్ణాటకలో రాజ్యాంగం గెలిచిందని మొదలుపెట్టి… వెంటనే ఏపీకి టర్న్ కి తీసుకుంటూ, అంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘన ఆంధ్రాలో నాలుగేళ్లుగా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారంటూ భాజపాపై ఆరోపణలు వస్తే… ఆంధ్రాలో 23 ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేశారు అని ఆరోపించారు. అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారనీ తప్పుబట్టారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీని వైకాపా అసెంబ్లీ బహిష్కరించినా ఫలితం లేదన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఇంకా.. టీడీపీని తప్పుబడుతూ మరికొన్ని విమర్శలు కూడా చేశారు.
ఫిరాయింపు రాజకీయాలకు ఏ పార్టీ పాల్పడ్డా ఎవ్వరూ వెనకేసుకుని రారు. టీడీపీ కూడా అందుకు మినహాయింపు కానే కాదు. కానీ, జగన్ స్పందనను జాగ్రత్తగా గమనిస్తే… కర్ణాటకలో భాజపాపై కేవలం ‘ఆరోపణలు’ మాత్రమే వచ్చాయంటున్నారు! బయటపడ్డ ఆడియో టేపులను జగన్ ఎందుకు ప్రస్థావించలేదు..? భాజపా తీరుపై, మోడీ షా ద్వయం రాజకీయాహంకారంపై దేశమంతా ముక్కున వేలేసుకుంటున్న ఈ సందర్భంలో కూడా… నేరుగా విమర్శించే ధైర్యం ఎందుకు చేయడం లేదు..? పరోక్షంగా వెనకేసుకొస్తున్న ధోరణిని ఏమంటారు..? ఈ సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీపై విమర్శల వైపు మళ్లించడాన్ని ఏమంటారు..?
భాజపా విషయంలో మొదట్నుంచీ జగన్ తీరు ఇంతే..! ప్రత్యేక హోదాపై పోరాటం అంటారు, కానీ కేంద్రాన్ని ప్రశ్నించరు. ఎందుకు ఇవ్వలేదని నిలదీయరు..! కేంద్రం అవిశ్వాసం తీర్మానం అన్నారు… అప్పుడూ కేంద్రాన్ని విమర్శించలేదు. ఇప్పుడు కర్ణాటక విషయంలోనూ అంతే… భాజపాని విమర్శించరు! వైకాపాకి భాజపా ఎంత ముఖ్యమో అనేది చెప్పడానికి జగన్ తాజా స్పందనే మరో ఉదాహరణ.