ఎమ్మెల్యేలుగా గెలిచిన యడ్యూరప్ప, శ్రీరాములు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఇందులో వివాదం ఏమీ లేదు. కానీ ఏపీ వైసీపీ ఎంపీలు నెలన్నర కిందటే రాజీనామా చేసినాఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేశారు. స్వయంగా స్పీకర్ చాంబర్ కు వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. వెంటనే ఆమోదించాలని కోరినట్లు ఎంపీలు బయటకు వచ్చి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం పదవులు త్యాగం చేశామని చెప్పి నిరాహారదీక్ష కూడా చేశారు.ఆ తర్వాత అనుకూల మీడియాలో తమ త్యాగాల గురించి పేజీలు పేజీలు రాయించుకున్నారు. త్యాగాన్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పుకుంటూ ఉంటారు.
అయితే హఠాత్తుగా లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఇద్దరు ఎంపీల రాజీనామాలు ఆమోదించినట్లు ప్రకటన వచ్చింది.ఈ ఇద్దరూ వైసీపీ ఎంపీలు కాదు. బీజేపీ ఎంపీలు, కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన యడ్యూరప్ప, శ్రీరాములు లోక్సభ ఎంపీలుగా ఉన్నారు. వీరు శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. ఎంపీ పదవులకు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంది. ఒక వేళ రాజీనామా చేసి ఆమోదించకపోయినా… అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగం పై వివాదం ఏర్పడుతుంది. అందుకే ఉన్న పళంగా అప్పటికప్పుడు రాజీనామాలు చేయిచేసి.. ఆమోదింపజేసుకున్నారు… అప్పటికప్పుడు రాజీనామాలు చేస్తేనే .. వెంటనే స్పీకర్ ఆమోదం తెలిపారు.
బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న వైసీపీ నేతలు.. రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడారన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఆమోదించకూడదనే షరతు మీదే రాజీనామా లేఖలిచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో స్పీకర్ కు .. రాజీనామా లేఖలు ఇచ్చిన సమయంలో తమపై ఒత్తిడి ఉన్నందుకే పదవులు వదులుకుంటున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. లేఖలు ఇచ్చిన రోజునే ఆమోదిస్తే… ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో… ఆగస్టులో పార్లమెంట్ సమావేశాల సమయంలో నిర్ణయం తీసుకుంటే.. ఉపఎన్నికలు రావని.. బీజేపీ-వైసీపీ అంచనా వేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం తప్పనసరిగా ఆమోదించాల్సిన పరిస్థితి రావడంతో.. ఇప్పుడు ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
వైసీపీ ఎంపీల రాజీనామా ఎత్తుగడ వెనుక.. టీడీపీ ఎంపీలపై ఒత్తిడి పెంచి రాజీనామాలు చేయాలనే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసిందని టీడీపీ వర్గాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు పోరాడుతూంటంతో సభ సజావుగా సాగడం లేదు. దీంతో రాజీనామాల పేరుతో.. టీడీపీ ఎంపీలను సభ నుంచి దూరం చేయడానికి వైసీపీ ఎంపీలను బీజేపీ పావుగా వాడుకున్నారని విమర్శలున్నాయి. ఇప్పుడు ఎంపీల రాజీనామాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం చూస్తే… అదే నిజమన్న విమర్శలు టీడీపీ నుంచి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి