ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఈ రోజు బయటకు వచ్చింది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని గంటలు ముందుగా, యంగ్ టైగర్ అభిమానులకు కానుకగా సినిమాలో ఎన్టీఆర్ లుక్, టైటిల్ విడుదల చేశారు.
‘అరవింద సమేత…’ అనేది టైటిల్. వీరరాఘవ… అనేది కాప్షన్. టైటిల్లో త్రివిక్రమ్ మార్క్ పొయెటిక్ స్టయిల్ స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ లుక్ విడుదలలో కూడా! అరవింద అనేది సినిమాలో హీరోయిన్ పేరు. కథలో ఆమెకు ప్రాముఖ్యత వుందని చాటి చెప్పేలా టైటిల్ రూపకల్పన చేశారు. ‘అత్తారింటికి దారేది’ నుంచి త్రివిక్రమ్ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇక, వీరరాఘవ అనేది హీరో పేరు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ. అటువంటి సినిమాకు ఇటువంటి టైటిల్ ఏంటని జనాలు ప్రశ్నించే ప్రమాదం వుంది. ముందుగా గ్రహించిన మాటల మాంత్రికుడు ఫస్ట్ లుక్‌లో హీరో చేత కత్తి పట్టించారు. చొక్కా విప్పించారు. ఆయన స్టయిల్ మాస్ మార్క్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చింది. ఈ మేకోవర్ సినిమా పట్ల ఆయనకు వున్న డెడికేషన్ ఎంతనేది చాటిచెప్పింది. మొత్తానికి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేసింది.
ఇవన్నీ పక్కన పెడితే… త్రివిక్రమ్‌కి టైటిల్స్ పెట్టడంలో ‘అ’ సెంటిమెంట్ ఎక్కువనే వాదన వినిపిస్తోంది. ‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా పరిచయమైన ఆయనకు గుర్తింపు, గౌరవం తెచ్చిన సినిమా ‘అతడు’. ఆ సినిమా టైటిల్ ‘అ’ అక్షరంతో మొదలైంది. తరవాత ‘అ’ అక్షరంతో మొదలయ్యే పేరుతో త్రివిక్రమ్ తీసిన సినిమా ‘అత్తారింటికి దారేది’. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పైరసీ రక్కసి కాటేసినా సూపర్ కలెక్షన్స్ సాధించింది. తరవాత ‘అ ఆ’తో మరో హిట్ అందుకున్నారు త్రివిక్రమ్. ఇక, గతేడాది వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ప్లాప్ అయినా త్రివిక్రమ్‌కి ‘అ’ అక్షరం మీద మమకారం తగ్గలేదనీ, ఆయనకు అది ఒక సెంటిమెంట్ కింద మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదండీ సంగతి.