కర్ణాటకలో ఎన్నికల వేడి ఊపందుకున్నప్పటి నుంచి అందరి చూపులు జేడీఎస్ నేత కుమారస్వామిపైనే ఉన్నాయి. ఆయన కింగ్ మేకర్ అవుతారని దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ వెల్లడిస్తూనే ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రచారానికి వచ్చిన తొలి రోజునే.. కుమారస్వామి తండ్రి దేవేగౌడను మంచి చేసుకునే ప్రయత్నం చేశారు. కింగ్ మేకర్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ.. కింగ్ అవుతారని మాత్రం ఎవరూ ఊహించలేదు. కొంత మంది జేడీఎస్ హార్డ్ కోర్ సపోర్టర్లు మాత్రమే… కుమారస్వామి సీఎం అవుతారని నమ్మారు.
నాలుగు రోజుల హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా తర్వాత ఎట్టకేలకు దూరమయిందనుకున్న సింహాసనం.. మళ్లీ దగ్గరయింది. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కుమారస్వామి సోమవారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుంది. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల అగ్రనేతలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం కుమారస్వామికి ఇది రెండో సారి. గతంలో బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. కుమారస్వామి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి చెప్పకపోతే ఏ నిర్ణయం తీసుకోలేని స్థితి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా హంగ్ ఏర్పడింది. అప్పుడు కూడా కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకోవాలనుకున్నాయి. కాంగ్రెస్ తరపున ధరం సింగ్ సీఎం పీఠం ఎక్కారు. అయితే రెండేళ్ల తర్వాత కుమారస్వామి కాంగ్రెస్ తొ పొత్తు తెంచుకుని బీజేపీ వైపు వెళ్లారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇరవై నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా పరిణితి కూడిన పాలనను అందించారన్న ప్రశంసలు తెచ్చుకున్నారు.
ఎంతైనా తండ్రీకొడుకులు ఇద్దరూ అదృష్టవంతులే. అతి తక్కువ పార్లమెంట్ స్థానాలున్న పార్టీ తరపున… దేవేగౌడ ప్రధానమంత్రి అయితే.. 224 స్థానాలున్న అసెంబ్లీలో 40 లోపు సీట్లు తెచ్చుకుని రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు కుమారస్వామి. కర్ణాటకలు రెండు జాతీయ పార్టీలు హోరోహోరీ పోరాడుకుని… అధికారాన్ని జేడీఎస్ కు అప్పగిస్తూంటాయి. గతంలో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం…బీజేపీ ..మూడు ముక్కలుగా మారడమే. యడ్యూరప్ప, గాలి వర్గం వేర్వేరుగా పోటీ చేయడంతో ఓటమి తప్పలేదు. ఈ సారి అందరి కలిశారు కాబట్టి ఆ మాత్రం సీట్లు వచ్చాయి. మళ్లీ జేడీఎస్ కింగ్ మేకర్ అయింది. కుమారస్వామి సీఎం అయ్యారు.