కర్ణాటకలో మెజార్టీ లేకపోయినా అత్యశకుపోయిన భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇబ్బంది పరిస్థితులను తెచ్చుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రోజులకే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎం అవుతారు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపబోతున్నాయి.
ఇది నరేంద్రమోదీ, అమిత్ షాల పరాజయం..!
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతాపార్టీ ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా దిగజారిపోయింది. గవర్నర్ వ్యవస్థ దగ్గర నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల వినియోగం వరకు అన్ని రకాల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను చేపట్టింది. తనకు అనుకూలంగా ఉంటుందని కొత్తగా అతి పెద్ద పార్టీ ప్రస్తావన దగ్గర్నుంచి ప్రొటెం స్పీకర్ సాయంతో అయినా గెలుద్దామనుకునేవరకు..ఈ దిగజారుడు సాగింది. కానీ ఒక్కరంటే..ఒక్క ఎమ్మెల్యేలను ఆకర్షించలేకపోయింది. ఏదీ కూడా సఫలమయ్యే పరిస్థితులు లేకపోవడంతో వెనక్కి తగ్గింది. కచ్చితంగా ఇది నరేంద్రమోదీ, అమిత్ షాల పరాజయమే.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన సుప్రీంకోర్టు..!
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. మెజార్టీ లేని సర్కారుకు గవర్నర్ అవకాశం ఇచ్చి పదిహేను రోజుల పాటు బలనిరూపణకు గడువు ఇవ్వడమే అసాధారణం. ఈ లోపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోమని ఆయన అవకాశం ఇచ్చినట్లయింది. దానికి తగ్గట్లే యడ్యూరప్ప… తనకు సహకరించే పోలీసు అధికారుల్ని ప్రమాణం చేసిన రోజే … కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైకి ప్రయోగించే ప్రయత్నం చేశారు. తనతో పాటు గాలి గ్యాంగ్‌ను ప్రయోగించి ఎమ్మెల్యేల బేరసారాలు ప్రారంభించారు. కానీ సుప్రీంకోర్టు బలపరీక్ష గడువును కుదించింది. ఒక్కరోజలో బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. దీంతో బేరసారాలకు పెద్దగా సమయం దొరకలేదు. గవర్నర్ ఇచ్చినట్లుగా పదిహేను రోజుల సమయం ఉంటే మాత్రం కావాల్సిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగానే బీజేపీ సమకూర్చుకుని ఉండేదనడంలో సందేహం లేదు.
కాంగ్రెస్‌కు మరో వెర్షన్ బీజేపీ..! తేడా ఏం లేదు..!
ప్రజాస్వామ్యంలో అక్రమ పద్దతుల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చడం, ఎర్పాటు చేయడంలో కాంగ్రెస్ ఎన్నో తప్పిదాలు చేసింది. అందుకే ఇంత కాలం బీజేపీ నేతలు కూడా.. కాంగ్రెస్ ను ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోరని విమర్శలు చేస్తూంటారు. కర్ణాటక పరిణామాలతో ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్‌కి తేడా లేదని తేలిపోయింది. తమ ప్రభుత్వం ఏర్పాటుకు … ఏ స్థాయికైనా దిగజారి… ఇప్పుడు కాంగ్రెస్సే బెటర్ అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. బీజేపీకి ఇంత కంటే మైనస్ ఏమీ ఉండదు. కాంగ్రెస్‌పై సంప్రదాయక వ్యతిరేకత చూపేవరిని కూడా.. బీజేపీ తన చర్యలతో … కాంగ్రెస్సే బెటర్ అనేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ అరవై ఏళ్లలో చేసి ఎన్ని తప్పులు చేసి చెడ్డ పేరు తెచ్చుకుందో.. బీజేపీ అంతకంటే ఎక్కువగా నాలుగేళ్లలో చెడ్డపేరు తెచ్చుకుంది.
గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాలి..!
భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థపై మొదటి నుంచి విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండకుండా… కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న ప్రజాప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న ఘటనలు.. ఏదో రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే జరిగింది. అసలు గవర్నర్ల వ్యవస్థ వద్దే వద్దన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు దీనిపై మరింత విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. రాజ్యాంగ రక్షణగా ఉండాల్సిన గవర్నర్ల వల్లే రాజ్యాంగానికి రక్షణ లేకపోవడం… అసలు ప్రమాదం. కర్ణాటక పరిణామాలతో దీనిపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రతిపక్షాల ఐక్యతను పెంచిన బీజేపీ..!
సాధారణంగా విపక్ష పార్టీలన్నీ ఎవరికి వారుగా ఉంటేనే అధికార పార్టీకి లాభం. కానీ కర్ణాటక ఉదంతంతో బీజేపీ విపక్షాలన్నింటినీ ఏకం చేసేసింది. యూపీ నుంచి ఏపీ వరకు ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ… తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఏకమయ్యేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా.. బీజేపీని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకుంటే.. నాయకత్వం అనే సమస్యే రాదు. లేదు కూటమి పెట్టి..తానే నాయకత్వం వహిస్తానని కాంగ్రెస్ మంకు పట్టు పడితే మాత్రం.. మళ్లీ విపక్షాల అనైక్యత వచ్చే అవకాశం ఉంది.అయితే ప్రస్తుత పరిస్థితుల విషయంలో కాంగ్రెస్‌కు క్లారిటీ ఉంది. అందుకనే.. ఎక్కువ సీట్లు వచ్చినా… సీఎం పోస్ట్ గురించి ఆలోచించకుండా.. జేడీఎస్‌కు దగ్గర చేర్చుకుంది. ఇదే వ్యహాన్ని దేశమంతా అమలు చేస్తే.. బీజేపీకి ప్రత్యామ్నాయమే.
కర్ణాటకలో ఆపరేషన్ కమల్ అయిపోలేదు..!
కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. అలాగని బీజేపీని ఆదరించలేదు. ఓట్ల పరంగా, సీట్ల పరంగా బీజేపీకి మెజార్టీ రాలేదు. కూటమిని ఏర్పాటు చేసుకోమనే ప్రజలు తీర్పిచ్చారు. కానీ బీజేపీ.. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎమ్మెల్యేలను చీల్చాలనుకుంది. విఫలయింది. కానీ ఇప్పుడు ఊరుకుండే పరిస్థితులు లేవు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. దీనికి బీహారే పెద్ద ఉదాహరణ. అక్కడ జేడీయూ – ఆర్జేడీల మధ్య బంధాన్ని తెగ్గొట్టి.. ఆర్జేడీని బయటకు తరిమేసి..జేడీయూతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. నిజానికి అక్కడ ఎన్నికల ముందే జేడీయూ-ఆర్జేడీ పొత్తులు పెట్టుకున్నాయి. బీజేపీని ప్రజలు తిరస్కరించారు. కానీ బీజేపీ అక్రమంగా పాలనలో భాగస్వామి అయింది. ఇదే పద్దతిని కర్ణాటకలోనూ ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య అంతా సాఫీగా సాగడం కష్టమే. విబేధాలొచ్చినప్పుడు ఆ మంటను పెద్దది చేసి.. బీజేపీ తాను చలి కాచుకునే అవకాశం ఉంది. అందుకే ఆపరేషన్ కమల్… కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకూ కొనసాగే అవకాశం ఉంది.