‘మహానటి’ సినిమా వచ్చింది. ప్రేక్షకుల హృదయాలను గెలిచి విజేతగా నిలిచింది. అదే సమయంలో సావిత్రి భర్త, తమిళ నటుడు ‘జెమినీ’ గణేశన్‌ని సినిమాలో చూపించిన తీరు పట్ల ఆయన మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘మహానటి’పై జెమినీ గణేశన్ కుమార్తె ఆవేదన’ పేరుతో తెలుగు360 పాఠకులకు ఆ వార్తను అందించింది. (చదవండి: https://www.telugu360.com/te/gemini-ganesan-daughter-comments-on-mahanati/)
తాజాగా కమలా సెల్వరాజ్ మరో అడుగు ముందుకు వేశారు. తండ్రి ‘జెమినీ’ గణేశన్ జీవితంపై డాక్యుమెంటరీ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తమిళ ప్రేక్షకులు ‘జెమినీ’ని ముద్దుగా ‘కాదల్ మన్నన్’ అని పిలుస్తారు. అంటే… ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అని మీనింగ్. అదే పేరుతో డాక్యుమెంటరీ తీయనున్నట్లు కమల తెలిపారు. ఓ గంట నలభై నిముషాలు నిడివితో రూపొందే ఆ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరాబాద్‌లోని మీడియా జనాలకు చూపిస్తామని ఆమె తెలిపారు. అప్పుడు ‘మహానటి’లో తన తండ్రిని ఎంత తప్పుగా చూపించారో ప్రజలకు అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘మహానటి’లో నిజాలు కంటే ఫిక్షన్ ఎక్కువుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “మా నాన్న హీరోగా బిజీగా వున్న సమయంలో సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. కానీ, సినిమాలో అందుకు విరుద్ధంగా చూపించారు. ఆయనకు అంత అవకాశాలు లేకపోతే లెజెండ్స్ ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లతో సమానంగా మూడు వందల సినిమాలు చేశేవారా? ఆయనకు అంత స్టార్డమ్ వచ్చేదా? ‘మహానటి’లో మొదటి నుంచి నాన్నను రూడ్‌గా చూపించారు” అని కమలా సెల్వరాజ్ పేర్కొన్నారు.