2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించారు. పోరాటయాత్ర పేరుతో బస్సుయాత్ర ప్రారంభించిన ఆయన తన కోరికను మొదటి సారి ప్రజల ముందు ఉంచారు. నిజానికి అధికారం విషయంలో పవన్ కల్యాణ్ … సందర్భానికి అనుగుణంగా మాట్లాడుతూంటారు. ఒక్కోసారి తనకు అధికారం ముఖ్యం కాదంటారు. ప్రజలకు సేవ చేయాలంటే.. అధికారం ఉండక్కర్లేదంటారు. అధికారంలోకి రావాలంటే… చాలా అనుభవం ఉండాలని..అందుకే తొందర పడలేదంటారు. నేను గెలవను అని తెలుసు కానీ.. కొంత మందిని గెలవకుండా చేయగలనని కూడా ప్రకటిస్తూంటారు. ఇప్పుడు మాత్రం పూర్తి క్లారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఆలోచనలు కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలతో మారిపోయాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 36 సీట్లతోనే కర్ణాటకలో కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం అందుతోందని.. అందుకే పవన్ కల్యాణ్.. తాను మెజార్టీ సాధించకపోయినా… కచ్చింగా ఓ పాతిక, ముఫ్పై సీట్లలో గెలుస్తానని అంచనా వేస్తున్నారు. టీడీపీ, వైసీపీల్లో ఎవరికి తక్కువ సీట్లు వస్తే.. వారే జనసేనకు మద్దతు ఇస్తారని.. పవన్ కల్యాణ్‌కు వ్యూహకర్తలు చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటక రాజకీయ పరిణామాలను సొంతంగా విశ్లేషించుకోలేకపోయిన… యడ్యూరప్ప రాజీనామా తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. పూర్తి సమాచారం లేదని తర్వాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యూహకర్తలు.. కర్ణాటక పరిణామాలు, దానికి జనసేనకు అప్లయ్ చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై వివరించినట్లు సమచారం.
అధికారం గురించి మాట్లాడుతూండటంతో పవన్ కల్యాణ్ మొత్తానికి ట్రాక్‌లోకి వచ్చాడని జనసేన కార్యకర్తలు సంతోషపడుతున్నారు. పవన్ టూర్లో ఫ్యాన్స్ హడావుడే ఎక్కువగా ఉంది. సినిమా విజయయాత్ర సాగినట్లు.. బస్సుయాత్ర రూట్ మ్యాప్‌ను రెడీ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే కొంత మంది పాతతరం రాజకీయ నేతలను.. జనసేన కోసం పని చేసేటట్లు చేయడంలో పవన్ సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాన్ఫిడెన్స్ కూడా పవన్ మాటల్లో ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.