రిసార్ట్ రాజకీయాలకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది..! ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యాలన్నా, ఉన్న ప్రభుత్వాలను వేర్పాటు చేయాలన్నా… రిసార్టులు చాలా అవసరం! ఎమ్మెల్యేలను దాచుకునేందుకు ఆధునిక పొలిటికల్ బ్యాంకులుగా రిసార్టులు మారిపోయాయి. తాజాగా, కర్ణాటక రాజకీయం కూడా వాటి చుట్టూనే తిరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ లు తమ సంఖ్యాబలం కాపాడుకునేందుకు, ఎమ్మెల్యేలను భద్రంగా దాచుకునేందుకు రిసార్టులనూ వాడుకున్నాయి. అయితే, ఈ వాడకం వెనక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరంటే… దొడ్డహళ్లి కెంపెగౌడ శివకుమార్!
కర్ణాటక రాజకీయ చదరంగంలో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేను హైదరాబాద్ కి, మరికొందరికి రిసార్టులకు పంపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, భాజపా ఎమ్మెల్యేలు సాగించిన బేరసారాల ఆడియో టేపులు బయటకి వచ్చేలా కృషి చేసిందీ ఆయనేననీ అంటున్నారు. రిసార్టు రాజకీయాలు నెరపడంలో శివకుమార్ సిద్ధహస్తుడు! 2002లో విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు… మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రీసార్టుకు ఈయనే తరలించారు. ఆ తరువాత, వారిని అత్యంత జాగ్రత్తగా అవిశ్వాస తీర్మానం నాటికి భద్రంగా ముంబై చేర్చారు. 2017లో అహ్మద్ పటేల్ సీటు కోసం కూడా ఇలానే ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు.
ఇదంతా ఆయనకి మాత్రమే ఎలా సాధ్యమౌతోందంటే.. పక్కా ప్లానింగ్, తనదైన నెట్ వర్క్ సాయంతో..! నాయకులను తరలించే బస్సులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆ బస్సులు ఎక్కడి నుంచి ఎటెళ్లాలనే రూట్ మ్యాప్ ఆయనకి మాత్రమే తెలుస్తుందట! బయలు దేరిన వాహనాలు ఎక్కడికి చేరుకుంటాయనేది కూడా ఆయన ఎవ్వరికీ చెప్పరట. ఇక, హోటళ్ల విషయానికొస్తే… ఈరోజు ఉదయం ఒక హోటల్లో కొంతమంది ఎమ్మెల్యేలను ఉంచితే, మధ్యాహ్నానికి మరో హోటల్ కి లొకేషన్ ఛేంజ్..! ఇలా మార్పులుంటాయట. ఇక, తప్పిపోయిన, లేదా తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యేలను పట్టుకుని, అసెంబ్లీకి హాజరయ్యేలా చేయడంలో ఆయన ప్లానింగ్స్ వేరే ఉంటాయట. ఇలాంటి అవసరాలకు తన సోదరుడు డీకే సురేష్ కుమార్ సాయం తీసుకుంటారు. సో.. ఇంత అనుభవం ఉంది కాబట్టి… ఎమ్మెల్యేలను ఆయనకి అప్పగిస్తే చాలు, వాళ్లంతా సేఫ్ అనే నమ్మకం! అంతేకాదు, ఎమ్మెల్యేలను వెతకమంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించినా… ఆ ట్రాక్ లో కూడా వందశాతం సక్సెస్ రేటు ఉందట. భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలతోపాటు, ఇలాంటి రీసార్ట్ స్పెషలిస్టులను కూడా కొత్త అపాయింట్ చేసుకోవాల్సి వస్తుందేమో కదా..?