“ఈ చిత్రంలో పాత్రలన్నీ కల్పితమే..” మహానటి సినిమా ప్రారంభంలో ఈ డిస్క్లైమర్ని వేయాలని దర్శకుడు మర్చిపోలేదు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు, చివరికి మీడియా కూడా మర్చిపోయింది. “మహానటి” సినిమాలో రంధ్రాలను అన్వేషించడం ప్రారంభించింది. నిజానికి “మహానటి” సినిమా సావిత్రి జీవిత కథ కాబట్టే సక్సెస్ అయిందంటే.. అది అమాయకత్వమే. ఆ సినిమాలోని కథనం ప్రేక్షకుల మనసుల్ని బరువెక్కించింది. కొన్నేళ్ల క్రితం వచ్చిన మాతృదేవోవభవ అనే సినిమా చూసి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండేవారు కాదు. ఇప్పుడు “మహానటి” కూడా ప్రేక్షకుల మనసుల్ని ఆ స్థాయిలో తాకింది. దాన్ని సినిమాగానే చూడాలి. అందర్నీ మెప్పించడం సాధ్యం కాదు కాబట్టి… దర్శకుడు పరిమితులకు లోబడి.. వివాదాల్లేకుండా పని పూర్తి చేశారు.
కానీ ఒక గొప్ప సంఘటన జరిగినప్పుడో.. అబ్బురపరిచే విషయం బయటకు తెలిసినప్పుడో.. అందులో మైనస్‌లు వెదికి పబ్లిసిటీ పొందేవారు.. చాలా మంది ఉంటారు. వీరిలో విమర్శకులు ఉంటారు. పూర్తి నెగెటివ్ మైండ్‌తో వ్యవహరించేవారూ ఉంటారు. మహానటి విషయంలోనూ అదే జరుగుతోంది. సినిమాలో తప్పులు ఎంచేవారి సంఖ్య ఎక్కువయిపోతోంది. సావిత్రి జీవితాన్ని దగ్గరుండి చూసినట్లు వారు విశ్లేషణలు చేస్తూంటారు. ఫలానా పుస్తకంలో అలా లేదంటూ.. చెబుతూంటారు. ముందుగా చెప్పుకున్నట్లు… మహానటి విషయంలో ఇలాంటివి రాకపోతేనే ఆశ్చర్యం. ఎందుకంటే మహానటి.. ఓ కళాఖండం.
అయితే ఈ సినిమాను బేస్ చేసుకుని.. ఇప్పుడు మీడియా తమదైన స్టైల్లో నారద పాత్రను పోషించడం ప్రారంభించింది. సావిత్రి, జెమినీగణేషన్ వారసుల మధ్య చిచ్చుపెట్టడం ప్రారభించింది. మూవీలో తమ తండ్రి గురించి తప్పుగా చూపించారంటూ.. జెమిని గణేషన్ – అలిమేలు కూతురు కమల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన తండ్రి డాక్యుమెంటరీని తీస్తానన్నారు. అంతే ఇక తెలుగు మీడియా పండగ చేసుకోవడం ప్రారభించింది. అక్కడ కమల ..ఇంటర్యూలను.. ఆమెకు కౌంటర్‌గా ఇక్కడ సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఇంటర్యూలను హైలెట్ చేయడం ప్రారభించారు. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకున్నట్లు ఉన్న ఈ ఇంటర్యూలను.. మీడియా ఎక్కడకు తీసుకెళ్తుందో ఊహించడం కష్టమే.
సినిమాలో ఎన్ని లోపాలైనా ఎంచవచ్చు. ఆది ప్రేక్షకుడి హక్కు. మీడియా రైట్. కానీ.. ఈ సినిమాలో చూపించిందే నిజం అన్నంత భ్రమ కల్పించి.. కొన్ని కుటుంబాల మధ్య..వివాదాలు పెంచడం మాత్రం ఆక్షేపణీయం. చనిపోయిన వారంతా గొప్పవాళ్లే. సావిత్రి, జెమిని గణేషన్‌లు ఇంకా గొప్పవాళ్లే. వేరే వాళ్ల సంగతేమైనా కానీ.. వారి వారి కుటుంబ సభ్యులకు గొప్పవారే. దీన్ని ఎవరూ కాదనలేరు. ఈ విషయంలోనూ..నారద పాత్ర పోషించి.. టీఆర్పీలకు ప్రయత్నించడం మాత్రం సమంజసం కాదు.