సూపర్ స్టార్ రజినీకాంత్… వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పార్టీ పెట్టలేదుగానీ, దానికి కావాల్సిన పునాదుల్ని బలంగా నిర్మించుకుంటున్నారు. ఇటీవలే అధికార పార్టీ చేయించిన ఓ రహస్య సర్వేలో రజినీకి దాదాపు 150 స్థానాల్లో అనూహ్య మద్దతు లభిస్తోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు.. ‘రేప్పొద్దున్న ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందాం, పరిస్థితులు ఎట్నుంచి ఎటుమారతాయో తెలీదు కాబట్టి, ఎవర్నీ ఏదీ విమర్శించకుండా మౌనంగానే ఉంటేనే బెటర్’ అని ఆలోచిస్తారు! వాస్తవ పరిస్థితులపై కూడా స్పందించలేరు. కానీ, కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై రజినీకాంత్ సూటిగా స్పందించారు. భాజపాపై ఘాటుగా విమర్శలు చేశారు.
కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసేవిగా ఉన్నాయన్నారు. బలపరీక్షకు 15 రోజులు కావాలంటూ గవర్నర్ ను భాజపా కోరడం హాస్యాస్పదం అన్నారు. ప్రజాస్వామ్యానికి మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి ఎడ్యూరప్ప రాజీనామా చేయడాన్ని ప్రజస్వామ్యం గెలుపుగా రజినీకాంత్ అభివర్ణించారు.
కర్ణాటక పరిణామాలపై ఏపీ నేతలు ఇంత సూటిగా స్పష్టంగా స్పందించారా..? కర్ణాటకలో రాజ్యాంగం గెలిచిందని మొదలుపెట్టి… టీడీపీ మీద విమర్శల దాడికే ప్రతిపక్ష నేత జగన్ పరిమితమయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై భాజపాపై ఆరోపణలు వచ్చాయన్నారు! నిజానికి, ఆడియో టేపులు కూడా బయటకి వచ్చాయి. భాజపా నేతల తీరు బహిర్గతమై చర్చ జరిగినా జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇక, కర్ణాటక పరిణామాలపై పవన్ మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు కొనుగోలు చేయని పార్టీలు ఏవైనా ఉన్నాయా..? భాజపా ఒక్కటే కాదు.. అందరూ అదే పని చేస్తున్నారనీ, మరొకరిని ప్రశ్నించి, వేలెత్తి చూపే స్థాయిల్లో ఎవ్వరూ లేరని అన్నారు. దేశవ్యాప్తంగా భాజపా చేస్తున్న రాజకీయంపై తీవ్రమైన వ్యతిరేక వ్యక్తమైనా… భాజపాని నేరుగా, సూటిగా విమర్శించేందుకు మన నాయకులు సాహసించరు ఎందుకో మరి..?