ఓ హిట్టు సినిమా తీసిన ఆనందం కూడా నిర్మాతకు దక్కడం లేదు. సినిమా హిట్టయితే జనం థియేటర్లకు వెళ్తారు. నాలుగు డబ్బులొస్తాయి. కానీ… మధ్యలో ఎన్ని అవాంతరాలో. పైరసీ వల్ల నిర్మాత బాగా నష్టపోతున్నాడు. మల్టీప్లెక్స్ లో సినిమా రాను రాను భారం అయిపోతోంది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడ్డానికి ప్రేక్షకుడు బద్దకిస్తున్నాడు. అలా.. కష్టాల మీద కష్టాలు. వాటికి తోడు ఇప్పుడు ‘క్యూబ్’ కష్టాలు తోడయ్యాయి.
సెలబ్రెటీలు, స్టార్లు, రాజకీయ వేత్తలు ఇప్పుడు థియేటర్‌కి వెళ్లడం లేదు. ఎంచక్కా ఇంట్లోనే ఓ హోం థియేటర్ పెట్టుకుంటున్నారు. దానికి శాటిలైట్‌తో కనక్షన్ ఉంటుంది. ప్రతీ సినిమాకీ ఓ శాటిలైట్ కోడ్ ఉంటుంది. దాన్ని సంపాదించుకుంటే… ఇంట్లోనే సినిమా చూడొచ్చు. ఆ కోడ్‌ని నిజానికి నిర్మాత దగ్గర నుంచి కొనుక్కోవాలి. దాదాపుగా రూ.10 వేలు ఖర్చు చేయాలి. ఓ రకంగా నిర్మాతకు ఇదో ఆదాయ మార్గం. కానీ అక్కడే ఆదాయానికి గండి పడుతోంది. ఓ మంచి సినిమా వస్తే చాలు.. సెలబ్రెటీలు, స్టార్లు, రాజకీయ నాయకులు సదరు నిర్మాతలకు ఫోన్లు చేసి ‘క్యూబ్ ఏర్పాటు చేయండి’ అని అడుగుతున్నారు. ఆ నిర్మాత మొహమాటం కొద్దీ ఫ్రీగానే క్యూబ్ కోడ్ ఇచ్చేస్తున్నాడు. సెలబ్రెటీల ఇంట్లో వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడడం లేదు. ఆ రోజున… చుట్టాలు, పక్కింటోళ్లు. స్నేహితులు.. మొత్తం.. ఆ సినిమాని ‘ఫ్రీ’గా చూసేస్తున్నారు. శుక్ర, శని, ఆది వారాలు క్యూబ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంటోందట. ఆ రోజున ఇంట్లో పార్టీలాంటిది ఒకటి సెటప్ చేసుకొని.. క్యూబ్‌లో సినిమా చూసుకుంటున్నారు. ఒక్కో క్యూబ్‌కీ సగటున 50 మంది సినిమా చూస్తున్నారని తెలుస్తోంది. ఆ లెక్కన.. వాళ్లంతా థియేటర్‌కి వెళ్లరన్నట్టేగా. అదంతా నిర్మాతకు టికెట్ల రూపంలో రావాల్సిన ఆదాయం. వాటికీ గండిపడుతున్న మాటే కదా.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఎఫ్ఎన్‌సీసీలో ఓపెన్ ఆడిటోరియం ఉంది. అక్కడ వీకెండ్స్ కొత్త సినిమాల్ని ప్రదర్శిస్తుంటారు. అది కూడా క్యూబ్ ద్వారానే. ఒక్కో సినిమా దాదాపుగా మూడొందల మంది చూస్తారు.. ఫ్రీగా. ఇదంతా నిర్మాతకు టికెట్ల రూపంలో రావల్సిన ఆదాయం. క్యూబ్ సిస్టమ్ వల్ల ఆ ఆదాయం రాకుండా పోతోంది. తెలుగు సినిమా బాగా ఆడుతోందంటే… పక్క రాష్ట్రాల నుంచి కూడా క్యూబ్‌లు ఏర్పాటు చేయమని ఆర్డర్లు వస్తుంటాయట. ప్రస్తుతం ‘మహానటి’కి ఇదే తలనొప్పి వచ్చింది. ప్రతీ రోజు కనీసం 20 మందికైనా క్యూబ్‌లు ఏర్పాటు చేయాల్సివస్తోందని సమాచారం. అలా ఒక్క రోజుకి దాదాపు 2 లక్షల నష్టం వాటిల్లుతోంది. ”ఇది వరకు ‘నాలుగు టికెట్లు ఇవ్వండి, పది టికెట్లు ఇవ్వండి’ అని అడిగేవారు.. ఇప్పుడు క్యూబ్‌లు ఇమ్మంటున్నారు. మొహమాటం కొద్దీ ఏర్పాటు చేస్తుంటే.. క్యూబ్లు అడిగేవారు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు” అని ఓ అగ్రశ్రేణి నిర్మాత తెలుగు 360తో తన గోడు వెళ్లగక్కుకున్నారు.