ఒక్కసారి సెలబ్రెటీ ట్విట్టర్ ఫాలోవర్స్ నెంబర్లు చూడండి… షాక్ తింటారు. ఒకొక్కరికీ మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటారు. మహేష్‌బాబు, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, రాజమౌళి. నాగార్జున వీళ్లందరి ట్విట్టర్ ఖాతాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మే అంకెలు కనిపిస్తాయి. ‘సౌత్‌లో మా హీరో తోపు..’ అంటే ‘మా హీరోనే గొప్ప’ అంటూ అభిమానుల మధ్య కూడా వాగ్వాదాలు జరుగుతుంటాయి. అయితే… ఆ అంకెలన్నీ నిజం కావు. అందులో సగానికి సగం `ఫేక్` అని తేలింది. ఓ ఆంగ్ల పత్రిక చేసిన లోతైన సర్వే తో.. సెలబ్రెటీల ట్విట్టర్ భాగోతాలు బయట పడ్డాయి. ప్రతీ సెలబ్రెటీ ట్విట్టర్ ఖాతాల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆ అంకెలన్నీ డొల్లే అని తేలింది.
సమంతకు ట్విట్టర్లో 6.78 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అందులో 32 శాతం ఫేక్ ఐడీలతో ఫాలో అవుతున్నవాళ్లే కనిపిస్తున్నారట. మహేష్ బాబుకి 6.47 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో దాదాపు 31 ల ఫేక్ ఐడీలున్నాయని తేలింది. అల్లు అర్జున్ విషయంలో అయతే ఫేక్ ఐడీ ల ఎఫెక్ట్ దారుణంగా తగిలింది. తన ఫాలోవర్స్‌లో 51 శాతం ఫేకే అట. బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ 2.43 మిలయన్స్ ఉన్నారు. అందులో అసలు ఫాలోవర్స్ 11,96, 325 అయితే.. ఫేక్ ఎకౌంట్స్ తో ఫాలో అవుతున్న వాళ్లు12,30, 298 ఉన్నారు. అంటే అసలు కంటే ఫేక్ ఫాలోవర్స్ ఎక్కువ. రాజమౌళి, ఎన్టీఆర్, రానా…. వీళ్ల ఎకౌంట్స్‌లో కూడా సగానికి సగం ఫేక్ ఫాలోవర్సే ఉన్నారు.
అయితే ఈ ఫేక్ పాలోవర్స్‌ని ట్విట్టర్ టీమ్ తనలో చేర్చుకుంటుందా, లేదంటే.. ఆటోమెటిగ్గా వాళ్లు యాడ్ అవుతారా అనేది ప్రశ్న. ట్విట్టర్లో మాకింత ఫాలోయింగ్ ఉంది రా బాబు.. అని గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది హీరోలు.. ఫేక్ ఎకౌంట్లపై ఆధారపడతారని తేలింది. కొంతమందికి మాత్రం అనుకోకుండా ఫేక్ ఫాలోవర్స్ పడిపోతుంటారని సమాచారం. తెలుగులోనే కాదు.. బాలీవుడ్ సెలబ్రెటీల ఖాతాల్లోనూ ఈ ఫేక్ అంకెలు కనిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా.. వీళ్ల ఖాతాలో ఉన్న సగం ఎకౌంట్లు ఫేక్ అట. ప్రియాంకా చోప్రా ట్విట్టర్ ఫాలోవర్స్‌లో దాదాపు 71 శాతం ఫేక్ ఫాలోవర్స్ ఉన్నార్ట. దేశం మొత్తమ్మీద ఆమెదే రికార్డు.