మెగా – నందమూరి పోటీ గత రెండు సంక్రాంతులుగా చూస్తూనే ఉన్నాం. ఓ యేడాది ఖైది నెం.150 – గౌతమిపుత్ర శాతకర్ణి రంగంలోకి దిగాయి. ఈ యేడాది అజ్ఞాతవాసి – జై సింహా పోటీ పడ్డాయి. ఇప్పుడు 2019లోనూ మెగా – నందమూరి క్లాష్ కు బాక్సాఫీసు వేదిక కాబోతోంది. 2019 సంక్రాంతికి ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీసుకురావాలన్నది నందమూరి బాలకృష్ణ ప్రయత్నం. దర్శకుడు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ… సంక్రాంతికి ఈ సినిమా రావడం దాదాపుగా ఖాయం. సరిగ్గా సంక్రాంతినే టార్గెట్ చేశాడు రామ్ చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోందని సమాచారం. ‘ఎవడు’ తరవాత సంక్రాంతి బరిలో నిలవలేదు రామ్‌చరణ్. ‘రంగస్థలం’ హిట్‌తో తనపై తనకు నమ్మకం వచ్చేసింది. పైగా బోయపాటి కూడా ఫామ్‌లో ఉన్నాడు. మాస్‌కి కావల్సిన సినిమాని అందించడంలో బోయపాటి దిట్ట. ఈసారి కూడా మాస్ మంత్రమే జపిస్తున్నారు వీరిద్దరూ. ”సంక్రాంతి బరిలో మేమూ ఉన్నామని..” త్వరలోనే ఓ ప్రకటన చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. అటు బాలయ్య.. ఇటు చరణ్.. ఈ పోరుకి ఇంకెన్ని సినిమాలు సై అంటాయో చూడాలి.