కర్ణాటకలో భాజపా ఆటలు సాగనివ్వకుండా కట్టడి చేయడంలో కాంగ్రెస్-జేడీఎస్ ల కూటమి సక్సెస్ అయింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు వచ్చేసరికి.. రెండు పార్టీల మధ్యా పదవుల పంపిణీ ఎలా అనే గందరగోళం నెలకొంది. ఇదే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు ఢిల్లీకి బయలుదేరాలని అనుకున్నారు. కానీ, వారికి రాహుల్ అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇంకోపక్క, జేడీఎస్ నేత, కాబోయే ముఖ్యమంత్రి కుమార స్వామికి రాహుల్, సోనియాతో భేటీకి అవకాశం ఇవ్వడం గమనార్హం. అంటే, ముందుగా జేడీఎస్ డిమాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టున్నారు.
ఉప ముఖ్యమంత్రి, కొన్ని కీలక శాఖల మంత్రుల పదవుల విషయమై రెండు పార్టీల మధ్యా ఒక ఆమోదయోగ్యమైన సర్దుబాటు ఇంకా జరగలేదని సమాచారం. హోం శాఖ, విద్యుత్ లాంటి కొన్ని కీలక శాఖలు తమకే కావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖతోపాటు ఇతర కీలక శాఖలు తమకే ఉండాలని జేడీఎస్ కూడా పట్టుబడుతోంది. అంతేకాదు, ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తనకు అదే హామీ ఇచ్చారని కుమార స్వామి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఆయన ఆ మాట చెప్పిన తరువాతనే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము అంగీకరించామని జేడీఎస్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.
ఇంకోపక్క, మంత్రి పదవుల్లో కుల సమీకరణాల చర్చ కూడా తీవ్రంగానే జరుగుతోంది. కర్ణాటకలో బలమైన సామాజిక వర్గమైన లింగాయత్ డిమాండ్లు మరోలా ఉన్నాయి. తమ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వారూ ఓ పక్క పట్టు బడుతున్నారు. తమ కులానికి చెందిన ఎడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చూసుకుందామంటే కుదర్లేదనీ, కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణంలో తమ వర్గానికి కీలక పదవులు ఇవ్వాలంటూ ఆల్ ఇండియా వీర శైవ మహాసభ ఓ బహిరంగ లేఖ రాసింది. ఈ మహాసభకు అధ్యక్షుడుగా ఉన్న శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు తమవారికే దాదాపు 16 మంత్రి పదవులు కావాలంటూ వారిదో డిమాండ్..! ఈ నేపథ్యం పదవుల పంపకాలు అనేది రెండు పార్టీ మధ్య కాస్త తలనొప్పి వ్యవహారంగానే మారుతున్నట్టుగా ఉంది.