శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ పోరాటయాత్ర రోడ్ షో అట్టహాసంగా సాగుతోంది. నూనుగు మీసాల కుర్రాళ్లంతా పవన్‌ను చూసేందుకు పరుగులు పెడుతున్నారు. సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ కూడా వారిని నిరాశపరటం లేదు. రెండో రోజు పోరాటయాత్రలో ఆయన సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిేకంగా పోరాడి ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. అక్కడే థర్మల్ పోరాట కుటుంబాలతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే జనసేన అంగీకరించబోదని తేల్చిచెప్పారు. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి కావాలని చెప్పారు. ఏం అర్థమయిందో కానీ.. అక్కడ చేరిన చిన్నాచితకా మనుషులంతా చప్పట్లు కొట్టారు.
నిజానికి పర్యావరణాన్ని కాపాడే అభివృద్ది అంటే ఏమిటో పవన్ కల్యాణ్‌కు అయినా తెలుసో లేదో మరి..! ప్రపంచంలో మంచీచెడూ రెండు వేర్వేరుగా ఉండవు. ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫీ పుస్తకాలు చదవిన పవన్ కల్యాణ్‌కు ఈ సూక్ష్మం బాగానే తెలిసి ఉంటుంది. ఏదైనా ఒకరికి మంచి అయితే.. మరికొంత మంది చెడు అవుతుంది. అందరీ మంచి చేయగలిగే పనిని ఫ్యాన్స్ దేవుడుగా భావించే పవన కల్యాణ్ కూడా చేయలేరు. అంతెందుకు ఆయన పోరాటయాత్ర పేరుతో రోడ్ షోలు చేస్తే ఎవరికి మంచి జరుగుతుంది..? పవర్ స్టార్ అన్న క్రేజ్‌తో పవన్‌ను చూడటానికి వచ్చే యువతకు… పనులు మానుకుని సినిమా వాళ్ల వెంట పడటం కరెక్ట్ కాదని మంచీ చెడూ చెప్పే వారెవరుంటారు..? అంతెందుకు.. పలాస కవాతులో.. బౌన్సర్లు.. ఫ్యాన్స్‌ను చితక బాదేశారు. పిడిగుద్దులు గుద్దారు. అభిమానులు ఏం తప్పు చేశారు..? కళ్ల ఎదుటకు వచ్చిన తమ అభిమాన నాయకుడ్ని దగ్గరగా చూద్దామనుకోవడమే వారి తప్పు.
పవన్ కల్యాణ్ పోరాట యాత్ర.. మొత్తం ఓ షోలా నడిచిపోతోంది. ఓ రాజకీయ యాత్రలా కాకుండా.. ఓ సినిమా సక్సెస్ మీట్ కోసం వచ్చినట్లు.. ప్రజల చేత జేజేలు కొట్టించుకోవడానికి వచ్చినట్లు సాగిపోతోంది. సమస్యలు తెలుసుకునేంత వెలుసుబాటు పవన్ కల్యాణ్‌కు కూడా ఉండటం లేదు. ఎందుకంటే.. ఆయన్ని జనం ఓ సినీ హీరోగానే చూస్తున్నారు. ఇంకా రాజకీయ నేతగా చూడటం అలవాటు చేసుకోలేదు. ఏం చెప్పినా దాన్నో సినిమా డైలాగ్‌లా భావిస్తున్నారు తప్ప… తమ సమస్యలు ఆలకిస్తున్నారని అనుకోవడం లేదు. పలాస పోరాట యాత్రలో .. పాల్గొన్న ప్రజలు, పవన్ చెప్పే విషయాల పట్ల వాళ్ల రియాక్షన్ చూస్తే అదే అనిపించింది…
– సుభాష్