జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పే ఆదర్శలు స్ఫూర్తివంతంగా ఉంటాయి. తనకు కులం ఆపాదించవద్దని హెచ్చరిస్తూంటారు. నిజానికి పవన్ కల్యాణ్‌లో కూడా ఈ కులమనే భావన ఉండి ఉండదేమో..? కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత .. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా…కులం కేంద్రంగానే రాజకీయం చేయాల్సి ఉంటుంది. తన కులానికే న్యాయం చేస్తానంటే… అది రాజకీయం కాదు. సామాజిక న్యాయం చేయాలి. నిజానికి ఈ మాట పవన్ కళ్యాణ్ నోట ప్రతి సందర్భంలోనూ వస్తుంది. కానీ సామాజిక న్యాయం అనే పదానికి పవన్ కల్యాణ్ కు అర్థం తెలుసా అనే విమర్శలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. దానికి కారణం.. పార్టీ పదవుల భర్తీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం.
పార్టీ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత పార్టీ పదవులను వరుసగా భర్తీ చేస్తూ వస్తున్నారు. నాలుగో ఆవిర్భావ సభకు కొద్ది రోజుల ముందు నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు గంగాధరంను పార్టీలో చేర్చుకుని కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. నాలుగు రోజుల కిందట తోట చంద్రశేఖర్ అనే నేతను పార్టీలో చేర్చుకుని ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేశారు. ముందు నుంచీ జనసేనకు… కోశాధికారిగా మారిశెట్టి రాఘవయ్య వ్యవహరిస్తున్నారు. అధికార ప్రతినిధులుగా యాక్టివ్ గా అద్దేపల్లి శ్రీధర్, పార్థసారధి ఉంటున్నారు. మీడియా కోఆర్డినేటర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన యువజన విభాగం ప్రెసిడెంట్‌గా కొత్తగా కిరణ్ , జనసేన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జ్గా ముత్తంశెట్టి కృష్ణారావులను నియమించారు. అందరూ ఒకే సామాజికవర్గం వారు. వేరేవారికి అవకాశం దక్కలేదు.
పవన్ కల్యాణ్ పార్టీ పదవుల్ని భర్తీ చేస్తూంటే.. ఆ పార్టీ నేతలు సంతోషపడాలి. కానీ అంతా ఒకే సామాజికవర్గం వారు పదవుల్లో నియమితులవుతూండటంతో.. పవన్ ను అభిమానించే ఇతర సామాజికవర్గాల వారు అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీలో జగన్ .. తమ సామాజికవర్గానికి ఎలా పెద్ద పీట వేస్తారో.. పవన్ కూడా అలాగే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజికన్యాయం పాటించాలన్న సూచనలు ఆయన శ్రేయోభిలాషుల నుచి వస్తున్నాయి. మరి జనసేనాధినేత వింటారా..?