కేంద్రంతో ఢీ అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఒక పెద్ద సవాల్ ఉందని ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేంటంటే, ఆంధ్రాకి కేంద్రంలోని భాజపా చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలడం, సెంటిమెంట్ ను వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించగలడం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్ల వేచి చూశామనీ, 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికే చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. ఇంకోపక్క రాష్ట్రాన్ని భాజపా నమ్మక ద్రోహం చేసినా… అది టీడీపీ సర్కారు వైఫల్యంగా ఎత్తున ప్రచారం చేస్తోంది ప్రతిపక్ష పార్టీ. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలాంటి భావజాలం వెళ్తోందన్న కొంత సందిగ్ధత ఉన్న మాట వాస్తవమే. అయితే, కర్ణాటకలో తెలుగువారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భాజపాకి ఆశించిన స్థానాలు రాలేదు. దీంతో ఈ పరిస్థితి టీడీపీకి కొంత బలం చేకూర్చినట్టయింది.
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… తెలుగువారు ఎక్కడున్న ఇలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పాలనీ, చిత్తుచిత్తుగా ఓడించాలని ఆరోజున పిలుపునిచ్చానని అన్నారు. దాని పర్యవశానమే ఈరోజున కర్ణాటకలో భాజపా ఓడిపోయిందన్నారు. దానికి తాను చాలా సంతోషపడుతున్నా అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మనకి అన్యాయం చేసిందనీ, దాంతో 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అడ్రస్ గల్లంతయిందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు శిక్షించారని అన్నారు. ఇప్పుడు భాజపా కూడా అదే తరహాలో మనకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. విభజన చట్టంలో పెట్టిన హామీలు ఇచ్చి తీరాలనీ, ప్రత్యేక హోదా మా హక్కు అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలను శిక్షించడం సరైందా అనే ప్రశ్నకు కేంద్రం బదులివ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి పరుల్ని భాజపా పక్కన పెట్టుకుంటోందని ఆరోపించారు.
కర్ణాటక ఫలితాన్నే ప్రచారం కోసం టీడీపీ ప్రధానంగా ప్రస్థావించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీపై ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఎన్ని విమర్శలు చేస్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని చెప్పడానికి కర్ణాటకలోని ఫలితాలే నిదర్శనం అనే నమ్మకం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. తమకు అంది వచ్చిన ప్రచారాస్త్రంగా ఈ అంశం పనికొస్తోందనే విశ్లేషణలు కొంతమంది నేతలు చేస్తున్నారు. కానీ, సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉంది. ఇప్పట్నుంచీ అప్పటి వరకూ భాజపాపై ఇదే ఫీల్ ను ప్రజల్లో నిలపడం ఇప్పటికీ టీడీపీ ముందున్న సవాలే అని చెప్పాలి.