టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌతిండియాలోనే నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా స్థానం సంపాదించుకున్నాడు దేవిశ్రీ. ఆ మాటకొస్తే.. బాలీవుడ్‌లోనూ దేవీ ఫేమసే. అక్కడి నుంచి అవకాశాలు వస్తున్నా – దేవి వెళ్లడం లేదు. ఎందుకంటే సౌతిండియాలో దేవిశ్రీ అంత బిజీ. భారీ సినిమాలన్నీ ముందు దేవిశ్రీ ని సంప్రదించి.. కుదరకపోతే అప్పుడు మరో ఆప్షన్‌ని ఎంచుకుంటాయి. చిన్న సినిమాలు కూడా అప్పుడప్పుడూ దేవిని తలచుకుంటుంటాయి. ఈ డిమాండ్‌ని బట్టే.. తన పారితోషికం ఉంటుంది కదా? అందుకే ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు దేవి. ఇంత పారితోషికం ఏ టెక్నీషియన్‌కీ ఇవ్వడం లేదు. పారితోషికం మాట అటుంచితే… దేవి షరతులు, డిమాండ్లూ చాలా ఉంటాయి. దేవికి ముందే బౌండెడ్ స్క్రిప్టు ఇవ్వాల్సి ఉంటుంది. ‘ఇదీ లైను’ అని చెబితే కుదరదు. ఎక్కడ పాట రావాలో కూడా దేవినే డిసైడ్ చేస్తుంటాడట. దేవికి స్క్రిప్టులో నాలెడ్జ్ చాలా ఉంటుంది. కాబట్టి.. దేవి జడ్జిమెంట్‌ని చిత్రబృందాలు కూడా గౌరవిస్తుంటాయి.
కానీ చెప్పిన టైమ్‌కి పాటలు ఇవ్వడని దేవి గురించి బాగా తెలిసినవాళ్లు చెబుతుంటారు. గీత రచయితలకు, గాయకుల విషయంలోనూ దేవిదే అంతిమ నిర్ణయం. ‘ఫలానా గీత రచయితకు ఓ పాట ఇవ్వండి, ఫలానా గాయకుడితో పాడించండి’ అన్నా దేవి వినిపించుకోడట. దేవి షరతులు కొన్ని సార్లు… ఇబ్బంది పెడుతున్నా. `దేవి చేతిలో సినిమా పెడితే మ్యూజిక్ గురించి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు` అంటూ దర్శకులు రిలాక్స్ అయిపోతుంటార్ట. రామ్ నటిస్తున్న ఓ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు. దానికి కారణం… క్రియేటివ్ డిఫరెన్సెన్ అని ప్రచారం ఉంది. నిజానికి సినిమా మొదలై ఇన్ని రోజులైనా దేవి ఒక్క పాట కూడా ఇవ్వలేదట. అడిగితే.. ‘ఇంకా ట్యూన్ తట్టలేదు.. తట్టినప్పుడు చెబుతా’ అని బదులిస్తున్నాడట. అందుకే ‘మరొకర్ని చూసుకుంటాం’ అని చిత్రబృందం దేవిని తప్పించినట్టు తెలుస్తోంది. దేవి కావాలంటే… కాస్త ఓపిక పట్టాలి మరి.