అందాల రాముడుతో హీరో అయ్యాడు సునీల్. హీరో అయ్యాక ఏం సంపాదించాడో తెలీదు గానీ, చాలా కోల్పోయాడు. కమెడియన్ గా స్టార్ డమ్ అనుభవిస్తున్నప్పుడు హీరో అవ్వడం కాస్త కలిసొచ్చింది. కానీ సినిమామీద సినిమా ఫ్లాప్ అవ్వడంతో… సునీల్ కెరీర్ పూర్తిగా అధఃపాతాళానికి పడిపోయింది. మళ్లీ కమెడియన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమధ్య నాలుగైదు సినిమాల్లో కమెడియన్ పాత్రలకు సునీల్‌ని ఎంచుకున్నారు కూడా. అయితే.. ఈ అవకాశాలు కూడా `సునీల్ బలవంతం`పైనే వచ్చాయన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. హీరోగా తన కెరీర్ ఎలాగూ ముందుకు సాగదనుకున్న సునీల్… ఆ తరవాత కమెడియన్ పాత్రలపై దృష్టి పెట్టాడు. నిజానికి సునీల్ తరవాత ఇండ్రస్ట్రీకి చాలామంది కమెడియన్లు వచ్చారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, పృథ్వీ.. ఇలా ఒకొక్క సీజన్లో ఒకొక్క కమెడియన్ని చూసేసింది పరిశ్రమ.
ఇప్పుడు సునీల్ కంటూ కమెడియన్ల గ్యాంగ్‌లో చోటంటూ ఖాళీగా లేదు. సునీల్ కోసం కొత్త పాత్రలు రాసుకుందామా అంటే.. హీరోకి తక్కువ.. కమెడియన్‌కి ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్థితి. సునీల్ ఉన్నాడు కదా అని చిన్నా చితకా పాత్రలు ఇవ్వలేరు. అలాగని హీరోకి సమానమైన క్యారెక్టర్లూ సృష్టించలేరు. ఇది వరకటిలా రోజువారీ పారితోషికం ఇవ్వలేరు. అలాగని అడిగినంత ముట్టజెప్పలేరు. కాబట్టి.. ‘నేను కామెడీ పాత్రలకు రెడీ’ అంటున్నా సునీల్ వైపు చూడడం లేదు జనం. పైగా తన లుక్ పూర్తిగా మారిపోయింది. ఇది వరకు బొద్దుగా బంతి ఆకారంలో ఉండేవాడు. కామెడీ చేయడానికి తన ఫేసు కరెక్ట్‌గా సూటయ్యేది.. ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. తన అవతారమూ.. మైనస్‌గా మారే ప్రమాదముంది. పైగా ఇది వరకటిలా.. సునీల్‌పై పంచ్‌లు వేసి, బకరా చేయడం కూడా కష్టమే. అందుకే.. సునీల్ కమెడియన్ వేషాలు వేయడానికి రెడీగా ఉన్నా… సినీ జనాలు మాత్రం లైట్ తీసుకుంటున్నారని తెలిసింది. అయితే సునీల్ మాత్రం అందరికీ టచ్‌లోకి వెళ్తున్నాడట. ‘మీ సినిమాలో వేషం ఉంటే చెప్పండి.. చేసేస్తా’ అంటూ. అప్పట్లో ‘మాకు సునీల్ కావాలి.. కావాలి’ అంటూ దర్శకులు వెంట పడేవారు. ఇప్పుడేమో.. ‘నాకేమైనా పాత్ర ఉందా?’ అంటూ సునీల్ వెంట పడుతున్నాడట. కమెడియన్‌గా ఒకట్రెండు పాత్రలు వర్కవుట్ అయితే.. సునీల్ కెరీర్ గాడిలో పడుతుంది. అప్పటి వరకూ ఇలా వెంట పడడం తప్పదేమో..?