ఉపరాష్ట్రపతి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కలుస్తారు. ఆ రాష్ట్రంలో జాతీయ సంస్థ శంకుస్థాపన అంటే..కచ్చితంగా ముఖ్యమంత్రి కూడా హాజరయ్యేవారి జాబితాలో ఉంటారు. అలాగే ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి పాత స్నేహితులైతే… ప్రైవేటుగా విందులు కూడా నిర్వహిస్తారు. కానీ వెంకయ్యనాయుడు విజయవాడ పర్యటనలో ఇవేమీ లేవు. సింపుల్ గా చెప్పాలంటే.. ఉపరాష్ట్రపతి విజయవాడ వస్తున్నారన్న విషయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు లైట్ తీసుకున్నారు.ప్రొటోకాల్ ప్రకారం కనీసం ఓ సారి పలకరిద్దామని కూడా అనుకోలేదు.
ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్ లో పోరాడింది వెంకయ్యనాయుడే. ఆయన వల్లే అప్పటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ప్రత్యేకహోదా హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ హామీ అమలు చేయలేదు. సాధ్యం కాదని చెప్పడంతో ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు. ఆ ప్యాకేజీ నిధులు కూడా ఇవ్వకుండా.. హోదా ఉద్యమం పేరుతో.. రాష్ట్రంలో వైసీపీ, జనసేనను ఎగదోసింది బీజేపీ అధిష్టానం. ఇదంతా తెలిసిన తర్వాత బీజేపీకి పూర్తిగా గుడ్ బై చెప్పారు. అప్పట్నుంచి..ఏ ఒక్క బీజేపీ నేత మొహం కూటా చూడటం లేదు. బీజేపీ పేరు చెబితేనే ఫైర్ అవుతున్నారు.
ఉపరాష్ట్రపతిగా ఉన్నారు… పైగా చిరకాల స్నేహితుడు కాబట్టి… వెంకయ్య విషయంలో చంద్రబాబు మామలూగానే ఉంటారనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పట్టించుకోలేదు. విమానాశ్రయంలో ఆహ్వానం పలకలేదు.. కొండపావులూరులో జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థ దక్షిణాది విభాగంను శంఖుస్థాపనకూ హాజరు కాలేదు. ఆ తరువాత స్వర్ణభారతి ట్రస్ట్ లో విద్యార్థుల బహుమతి కార్యక్రమానికి ఆహ్వానించినా వెళ్లలేదు. అమవరాతిలో ఉన్నా కావాలనే వెంకయ్యను లైట్ తీసుకున్నారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో బీజేపీ అంటే వెంకయ్యనాయుడే. ఆయనతో భేటీ అయితే..మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారాన్ని ఇతర పార్టీల నేతలు ప్రారంభిస్తారు.అందుకే బీజేపీ పొడ కూడ టీడీపీపై పడకూడదని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అందుకే ఉపరాష్ట్రపతి పర్యటననూ లైట్ తీసుకున్నారు. మొత్తానికి రాజకీయంతో వెంకయ్యనాయుడు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీకి తాను ఇప్పించిన ప్రత్యేకహోదా ఇవ్వకపోగా.. రాజకీయంగా ఉపరాష్ట్రపతి ఇచ్చి అచేతనుడ్ని చేశారు. ఇప్పుడు అదే కారణంగా ఏపీలో పాత స్నేహితుడు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడటం లేదు. చివరికి మోదీ-అమిత్ షాల వ్యూహం ఇద్దరు మిత్రుల మధ్య దూరం పెంచేసింది.