మహానటి సూపర్ హిట్ట్ అవ్వడంతో బయోపిక్‌లపై మోజు మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టీ ఎన్టీఆర్ బయోపిక్‌పై పడింది. నందమూరి బాలకృష్ణ కూడా ఈ చిత్రానికి సంబంధించిన కసరత్తులు ముమ్మరంగానే చేస్తున్నారు. కీలక నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో దర్శకుడితో మార్పు మొదలైంది. ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీయాలని బాలకృష్ణ భావించారు. కథా నిడివి పెద్దదిగా ఉండడంతో, ఈ కథని రెండు భాగాలుగా విభజించాలని అనుకున్నారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అంతా ఓ భాగంలో, రాజకీయ విజయాలన్నీ రెండో భాగంలో చూపించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం మారింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర మొత్తం ఒకే సినిమాగా తీర్చిదిద్దాలన్న నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగా సన్నివేశాల్ని స్క్రిప్టు దశలోనే ట్రిమ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్కో భాగం రెండు గంటలు ఉండేలా స్క్రిప్టు తయారు చేశారు. ఇప్పుడు మూడు గంటల నిడివి ఉన్న సినిమాల్ని చూడ్డానికి కూడా జనం ఇష్టపడుతున్నారు. అందుకే ఒకే భాగం తీద్దాం.. నిడివి ఎక్కువైనా ఫర్వాలేదన్న నిర్ణయానికి వచ్చారట బాలయ్య. క్రిష్ కూడా ‘ఒక భాగం అయితేనే బాగుంటుంది’ అని చెప్పడంతో బాలయ్య తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. సో.. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా కాదు, ఒక సినిమాగానే చూడబోతున్నామన్నమాట.