పవన్ కల్యాణ్ జనసేన ప్రారంభించి నాలుగేళ్లవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిగా మద్దతు ప్రకటించి ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా.. ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. అనేక సమావేశాల్లో తనకు అధికారం అంటే తొందర లేదని.. తాను పాతికేళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రశ్నించడమే తన విధానమన్నారు. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా నాలుగో ఆవిర్భావ దినోత్సవం రోజున తెలుగుదేశం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ రోజు నుంచి..ఆయన తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. పోరాటయాత్ర పేరుతో బస్సు యాత్ర చేస్తున్న పవన్ ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. దీనిపై రాజకీయవర్గాల్లో ఏం చర్చ జరిగినా పవన్ కల్యాణ్ మాత్రం ఓ సందేశం ప్రజల్లోకి పంపదలుచుకున్నారు. ఇంత కాలం అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూండటం వల్ల పార్ట్ టైమ్ పొలిటిషియన్ అని అనుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టి..తాను పూర్తి స్థాయిలో ప్రజాజీవితంలోకి వచ్చాననే సందేశాన్ని పంపడానికి పవన్ కల్యాణ్ అన్ని సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించారు.
మరి పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా..?. అంటే తీసి పారేయలేం. పవన్ కల్యాణ్‌కు ఎంతో అభిమానగణం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఉంది. పవన్ పై ప్రత్యేకంగా ఆరోపణలు లేవు. అలాగే.. ముఖ్యమంత్రి అవడానికి మెజార్టీ అవసరం లేదని కొత్తగా కర్ణాటక పరిణామాలు చెబుతున్నాయి.ఇవన్నీ పవన్ కల్యాణ్ కు ఉన్న ప్లస్ పాయింట్లు. కానీ లక్ష్యం అందుకోవాలంటే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి.
చంద్రబాబు వర్సెస్ జగన్ అనే పరిస్థితి మార్చగలరా..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పోటీ అంతా.. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే ఉంది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా.. ? జగన్ ముఖ్యమంత్రి కావాలా..? అన్నదే ప్రజల ముందు ఆప్షన్. కానీ కర్ణాటకలో అలా లేదు. కొన్ని ప్రాంతాల్లో రెండు పార్టీల మధ్య మాత్రమే పోలరైజేషన్ లేదు. మధ్యలో జేడీఎస్ కూడా ఆప్షన్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ.. అలాంటి పొలరైజేషన్ రావాలి. అదే తెలంగాణలో అలా లేదు. అక్కడ అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అక్కడ ప్రజలు అన్ని పార్టీలను ఆదరించారు. కానీ ఏపీలో మాత్రం భిన్నం. ఈ చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న బైపొలారిటీని బ్రేక్ చేయకుండా… వపన్ కల్యాణ్ కు చాన్స్ రాదు. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పాటు జగన్ ను కూడా తీవ్రంగా విమర్శిస్తూ.. ఈ బైపొలారిటీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది సరిపోదు.
కలసి వచ్చే వాళ్లని కలుపుకెళ్లాలి..!
ఈ బైపొలారిటీ కోసం పవన్ టీడీపీ, వైసీపీలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే దీనికి కలసి వచ్చే వారిని కలుపుకుని వెళ్లాలి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ లతో ఎవరూ కలవరు. ఇక మిగిలింది వామపక్షాలు. ఈ పార్టీలతో పవన్ ఇప్పటికే కలసి పోరాటాలు చేస్తున్నారు. కానీ కలసి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రాలేదు. నిజానికి కమ్యూనిస్టులతో కలిస్తే విన్ – విన్ సిట్యూయేషన్ అవుతుంది. పవన్ అభిమానగణం. కమ్యూనిస్టుల కార్యకర్తల బలం కలిస్తే ప్రభావం చూపించవచ్చు. ఈ క్రమంలో ఎలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు లేదు.
జనసేన నాయకత్వ నిర్మాణం కావాలి..!
అలాగే ద్వితీయశ్రేణి నాయకత్వం. జనసేనలో పవన్ తప్ప మరో లీడర్ లేరు. ఈ సమయంలో… ఇతర పార్టీలోని బలమైన రాజకీయ నేతల్ని ఆకర్షించగలగాలి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం లేదు. వలస నేతలు అక్కర్లేదనుకంటే కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించాలి.ఈ దశలోనూ పవన్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం లేకుండా రాజకీయాలను ఎదుర్కోలేరు.
సోషల్ బేస్‌ను సమీకృతం చేసుకోవాలి..!
తన సోషల్ బేస్ ను సమీకృతం చేసుకోవడం పవన్ కల్యాణ్ కు చాలా అవసరం. కర్ణాటకలో సోషల్ బేస్ ను కాపాడుకునే.. జేడీఎస్ బలంగా నిలబడింది. ఇక్కడ కూడా పవన్ తన సోషల్ బేస్ ను బలం చేసుకుని… సమీకరించకుంటేనే పలితం ఉంటుంది. ఒకే సామాజికవర్గంగా ఉన్నప్పటికీ.. మధ్యలో వేరే వర్గాలున్నాయి. వీరందర్నీ ఎంతగా సమీకరించుకుంటారన్నదానిపై పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.