జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా పోరాటయాత్రలో కొంత రాజకీయం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎక్కడికి వెళ్లినా ఆయన ఎవర్నీ కలిసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. అత్యంత సన్నిహితులతో తప్ప మాట్లాడేవారు కాదు. ప్రజల్లోకి వెళ్తున్న తన తొలి బస్సుయాత్రలో మాత్రం కొంచెం మార్పు చూపిస్తున్నారు. దానికి రాజకీయ అవసరాలే కారణం కావొచ్చు. నియోజకవర్గాల్లో ఫ్యాన్స్ తప్ప పవన్ కు క్యాడర్ లేదు.అందుకే కనీసం ఓ స్థాయి ఉన్న నేతనైనా.. పార్టీ ఫేస్‌గా ఉంచుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అందు కోసం… ఇతర పార్టీల నేతలవైపే చూస్తున్నారు. ఇచ్చాపురంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ అలియాస్ లల్లూని పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరిపారు. దీన్ని జనసేన వర్గాలు కన్నా.. నరేష్ కుమార్ అగర్వాల్ వర్గీయులే ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. నిజంగా ఆయనకు చేరే ఆసక్తి ఉండి.. పవన్ కు కూడా జనసేనలోకి తీసుకోవాలనుకుంటే.. పోరాట యాత్ర కన్నా మంచి సందర్భం ఏముంటుంది. కానీ ఇందులో రాజకీయం కూడా.. పవన్ కల్యాణ్ అర్థం చేసుకోలేకపోయారు.
ఇచ్చాపురంలో కాంగ్రెస్ 2004లో ఒక్కసారి మాత్రమే గెలిచింది. అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు లల్లూ. ఆయన వైఎస్ కు సన్నిహితుడు. అయినా 2009లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. అప్పట్నుంచి ఏ ప్రధాన పార్టీ కూడా ఆయనను ఎన్నికల బరిలో నిలిపే ధైర్యం చేయలేదు. ఇలాంటి నేత కూడా.. జనసేతో చర్చల పేరుతో లీకులిస్తున్నారంటే… దీని వెనుక ఉన్న రాజకీయాన్ని పవన్ అర్థం చేసుకోనట్టే. మరో బలమైన పార్టీని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆయన జనసేనను ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటు.. పలాస-కాశిబుగ్గలో… అక్కడి మున్సిపల్ చైర్మన్ కే పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీదుగానే నడిపించారు. జనసేన తరపున ఎప్పటి నుంచో తాము కష్టపడుతూంటే.. ఇప్పుడు ఆయనకు నేతకు ప్రాధాన్యం ఇవ్వడమేమిటని ..జనసేన కార్యకర్తలు ధర్నా చేయాల్సి వచ్చింది. ముందుగా తన కోసం..తన పార్టీ కోసం.. ఆయా నియోజకవర్గాల్లో పని చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేయకపోవడమే.. ఈ పరిస్థితికి కారణం. ఇది చేయాలంటే.. గడ్డాలు నెరియాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో కాశీబుగ్గ బస్ స్టాండ్ వద్ద చేసిన ప్రసంగంలో.. సినిమా డైలాగులు తప్ప…మరోసారి తన విజన్ ఏమిటో కనీస మాత్రంగా చెప్పలేకపోయారు. తనకు కసి ఉందని.. ఆవేశం ఉందని.. కడుపు మండి రోడ్డుపైకి వచ్చానని.. అరిచి చెబితే.. ప్రజలు.. సినిమా డైలాగులనుకుంటారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాం కాబట్టి..అక్కడి ప్రజల్ని పొగిడేతే సరిపోతుందనుకోవడం అమాయకత్వం. ఇప్పటికే వైఎస్ జగన్… రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని ప్రతి రోజూ చెబుతున్నారు. ప్రతి సమస్యకూ చంద్రబాబే కారణం అని చెబుతూ..తన విమర్శల్లో సీరియస్‌నెస్ కోల్పోయారు. ఇప్పుడు పవన్ కూడా అదే బాటలో ఉన్నారు. కిడ్నీ బాధితుల కోసం తానెంతో చేశానని చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత..ప్రభుత్వం అక్కడ రెండు డయాలసిస్ సెంటర్లు పెట్టింది. కిడ్నీ బాధితలకు పెన్షన్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ పనీ చేయలేదని.. తాను ప్రజాపాలన అందిస్తానని పవన్ చెప్పుకొస్తున్నారు.
ఎలా నమ్మించడం అనే దానిపై మాత్రం ఆయన కసరత్తు చేయడం లేదు. బస్సుయాత్రకు వచ్చే జనం తక్కువేమీ ఉండటం లేదు. అందులో పవన్ ను చూడటానికి వచ్చే వారెంత మంది..? ఆయన రాజకీయ ప్రసంగాలు వినడానికి వచ్చే వారెంత మంది..? వారినలో పవన్ మందిని కన్విన్స్ చేయగలుగుతున్నారు..? అన్నది ఎనాలసిస్ చేసుకునే తీరుబాటు జనసేన, ఆ పార్టీ అధినేతకు లేదనిపిస్తోంది.
– సుభాష్