చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా తెరంగ్రేటం చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు వారసత్వంగా వచ్చే అభిమాన గణమే కొండంత అండ. ముందు వాళ్ళను ఆకట్టుకుంటే, వాళ్ళల్లో సినిమాపై ఆసక్తి కలిగించగలిగితే సగం సక్సెస్ అయినట్టే. అల్లుడికి ఈ విషయం బాగా అర్థమయినట్టు వుంది. అభిమానులను ఆకట్టుకోవడం కోసం చిరంజీవిని వాడడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు కళ్యాణ్ దేవ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘విజేత’ టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో ‘విజేత’ ఒకటి. ఆ టైటిల్నే అల్లుడి సినిమాకు పెట్టారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకూ మావయ్య హిట్ పాటలను రీమిక్స్ చేయడం మాత్రమే చేశాడు. టైటిల్స్ కాపీ చేయలేదు. మెగా వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక.. ఎవరూ టైటిల్స్ దగ్గరనుంచి వాడకం మొదలుపెట్టలేదు. వాళ్ళందరి కంటే కళ్యాణ్ దేవ్ ఓ అడుగు ముందుకు వేశాడు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనేమో! టైటిల్ దగ్గర్నుంచి చిరంజీవి ఛరిష్మాను వాడుతున్నారు. సినిమాలో రీమిక్స్ పాటలు, డైలాగులు, ఫ్యామిలీ రిఫరెన్సులు ఇంకెన్ని వుంటాయో? వెయిట్ అండ్ సి!!