వరుస హిట్లతో టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా మారిపోయింది మైత్రీ మూవీస్. ఒకదాన్ని మించి.. మరో విజయం.. `రంగస్థలం` బ్లాక్ బ్లస్టర్తో మైత్రీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాల్ని పక్కన పెడితే.. మైత్రీ లాక్ చేసిన హీరోలు, దర్శకుల లిస్టు చాంతాడంత ఉంది. స్టార్ దర్శకులు, కొత్త వాళ్లూ అని తేడా చూడడం లేదు. అందరి చేతుల్లోనూ మైత్రీ అడ్వాన్సులు ఉన్నాయి. హీరోల పరిస్థితీ అంతే. మైత్రీ అడ్వాన్సు అందుకోని హీరోలు లేరు… అంటే అతిశయోక్తి కాదు. అడ్వాన్సు చేతిలో పెట్టినవాళ్లందరితోనూ సినిమాలు పూర్తి చేయాలంటే.. మైత్రీకి మరో పదేళ్లు పడుతుంది. ఆ స్థాయిలో జాబితా ఉంది. ఓ దర్శకుడు హిట్ కొడితే…. అడ్వాన్సులు ఇచ్చి కర్చీఫ్ వేసుకోవడం ఓ పద్ధతి. హిట్టున్నా, లేకపోయినా… సినిమాలున్నా, లేకపోయినా వాళ్లందరికీ అడ్వాన్సులు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కథ, హీరో ఇవేం ఓకే అవ్వకుండా దర్శకుల్ని అట్టి పెట్టుకోవడం కూడా విస్మయ పరిచేదే. ‘భవిష్యత్తులో పనికొస్తాడులే’ అన్న ధీమానా..? లేదంటే ‘పరిశ్రమలో అందరితోనూ సినిమాలు చేయాల్సిందే’ అనే ధ్యేయమా? అనేది అంతు చిక్కడం లేదు. `మనసంతా` తరవాత ఎవరూ పట్టించుకోని – చంద్రశేఖర్ ఏలేటికి మైత్రీ పిలిచి అడ్వాన్సు చేతికి ఇచ్చింది. సంతోష్ శ్రీనివాస్ పరిస్థితీ అంతే. చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని పట్టించుకోకుండా.. అందర్నీ బుక్ చేసుకొంటోంది మైత్రీ. అడ్వాన్సులంటే పదో, పరకో ఇవ్వరుగా. పారితోషికంలో కనీసం పది శాతం ఇవ్వాలి. మైత్రీ ఇచ్చిన అడ్వాన్సులతోనే రెండు సినిమాలు తీసేయొచ్చు. మరి వీళ్లందరితో సినిమాలు చేయడానికి ఎంత అవుతుందో? మైత్రీ ప్లానింగ్ వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు.