రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా పట్టాలు ఎక్కడం లేదు. బడ్జెట్ అవరోధాల వల్ల సినిమాను పక్కన పెట్టామని దర్శకుడు స్వయంగా వెల్లడించాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదని, ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనని దర్శకుడు ధృవీకరించాడు. ఓ రకంగా రామ్, ప్రవీణ్ సత్తారు, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని చెప్పుకోవాలి. కథ నచ్చిందని సినిమా ప్రారంభించి, భారీ బడ్జెట్తో తీసి, విడుదల సమయానికి ఇబ్బంది పడి, విడుదల తరవాత హిట్టైనా డబ్బులు రాలేదని బాధ పడటం కన్నా ముందు సినిమా నిర్మాణాన్ని ఆపేయడం మంచిదే. అయితే… రామ్ తన దగ్గర మాత్రమే ఎందుకిలా జరుగుతున్నదని ఆలోచించుకోవడం అత్యంత అవసరం. ఇటీవల రామ్ సినిమాల విషయంలో ఇటువంటి పరిస్థితి రావడం ఇది రెండోసారి.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’. దీనికి సంగీత దర్శకుడిగా ముందు దేవిశ్రీ ప్రసాద్ని తీసుకున్నారు. షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకు దేవిశ్రీ సినిమా నుంచి తప్పుకున్నాడు. సకాలంలో దేవిశ్రీ స్వరాలు అందించని కారణంగా అతణ్ణి తప్పించారని గుసగుస. కారణం ఏదైనా రామ్ సినిమా నుంచి ఒక వికెట్ తప్పుకుంది. తాజాగా రామ్ ఖాతాలో ఒక సినిమా ఆగింది. అంతకు ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అంధుడి కథతో సినిమా చేస్తున్నామని రామ్ ట్వీట్ చేశాడు. ఆ సినిమా కూడా ఆగింది. తరవాత రవితేజ హీరోగా అంధుడి కథతో ‘రాజా డి గ్రేట్’ చేశాడు అనిల్ రావిపూడి. పలువురు దర్శకులు, హీరోల మధ్య చర్చలు జరగడం సహజమే. చర్చల్లోకి వచ్చిన ప్రతిదీ సినిమాగా తెర మీదకు రాదు. చర్చలకు మాత్రమే పరిమితమవుతారు. అలా కాకుండా సినిమాలు ప్రకటించిన తరవాత ఆపేస్తే ఇండస్ట్రీలోకి, ప్రేక్షకుల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం వుంది.