టాలీవుడ్లో దాదాపుగా ప్రతీ అగ్ర కథానాయకుడికీ సొంత నిర్మాణ సంస్థ ఉంది. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ నిర్మాణంపై దృష్టి నిలపలేదు. అయితే ఈసారి ఆయన ప్రొడక్షన్‌పై ఇష్టం పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలయ్య ఓ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాతో తన సొంత ప్రొడక్షన్ కూడా మొదలెట్టారు. ఇక మీదటా.. అదే తీరు కొనసాగించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికీ… బాలయ్యే నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఆ తరవాత.. బాలయ్య సినిమా పట్టాలెక్కుతుంది. 2019 ఎన్నికల ముందు బోయపాటి సినిమా విడుదల చేస్తారు. 2014 ఎన్నికల సమయంలో ‘లెజెండ్’ వచ్చింది. అందులో పొలిటికల్ పంచ్‌లు బాగా పేలాయి. టీడీపీ క్రేజ్ పెరగడానికి ఆ సినిమా కూడా కాస్తో కూస్తో దోహదం చేసింది. సేమ్ టూ సేమ్… ఈసారీ అదే మ్యాజిక్ చేయాలని బాలయ్య – బోయపాటి భావిస్తున్నారు. ఇది వరకే బోయపాటి బాలయ్యకు కథ వినిపించి ‘ఓకే’ చేయించుకున్నారు. స్క్రిప్టు కూడా దాదాపుగా ‘లాక్’ చేసేశారు. చరణ్ సినిమా అవ్వడమే ఆలస్యం.