కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీకి సహజంగానే కొత్త జోష్ వస్తుంది. కానీ, అసలు ప్రశ్న ఇంకోటి ఉంది! అదేంటంటే.. ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి, వాటి వెనక నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా..? కర్ణాటకనే తీసుకుంటే… ఎన్నికలకు ముందు పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నించలేదు. ఒకవేళ కాంగ్రెస్, జేడీఎస్ లు ముందే పొత్తు పెట్టుకుని ఉంటే… మరిన్ని స్థానాలు సాధించే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే.. జేడీఎస్ ను ముందు పెట్టి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థతిలో కాంగ్రెస్ ఉంది.
గత ఏడాది జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలానే వ్యవహరించింది. మోడీ సొంత రాష్ట్రంలో భాజపాకి వ్యతిరేకంగా కలిసి ప్రచారం చేద్దామని అఖిలేష్ యాదవ్ ప్రతిపాదించినా, దాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు. దీంతో గతవారం మధ్యప్రదేశ్ లో పర్యటించిన అఖిలేష్, ఆ రాష్ట్రంలో అన్ని స్థానాలు పోటీకి సిద్ధపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల విషయంలో కాంగ్రెస్ ధోరణి ఇలానే ఉంటోంది. తమదే పైచేయి ఉండాలనే ఆలోచనా విధానం కనిపిస్తోంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆలోచనా విధానం పనికిరాదని కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ కి అనుభవమై ఉండాలి. ఓపక్క, జాతీయ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ ఆలోచనలు కదులుతున్నాయి. కాంగ్రెసేతర, భాజపాయేతర అనే ఆలోచనను కేసీఆర్ తెరమీదికి తెచ్చారు. భావసారూప్యతగల పార్టీల స్నేహం కోసం అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచనా విధానంలో కొంతైనా మార్పు కనిపించాలి. ప్రాంతీయ పార్టీలకు తాము ప్రాధాన్యత ఇస్తామనే సంకేతాలు ఇస్తే… వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే సంఘటిత రాజకీయ శక్తి ఏర్పడుతుంది. కానీ, ప్రస్తుతం అలాంటి ఆలోచన ఉన్నట్టుగా రాహుల్ వ్యవహార శైలిలో కనిపించడం లేదని కూడా అనుకోవచ్చు. ఎలా అంటే… నేడు బెంగళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చిన నేతల్లో ఎక్కువమందికి దేవెగౌడ నుంచి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఒకవేళ ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే.. ఈ సందర్భాన్ని కాంగ్రెస్ మరింత అనుకూలంగా మార్చుకోవాలి కదా.
ఎడ్యూరప్ప రాజీనామా చేయగానే… ఇది ప్రాంతీయ పార్టీల విజయం అని మమతా బెనర్జీ అభివర్ణించారు. పార్టీలు కలబోతున్నాయని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. కర్ణాటక విజయం జెడీఎస్ ది అన్నట్టుగానే ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు పరిగణిస్తున్నాయి. అంటే, వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవడం కాంగ్రెస్ లక్ష్యం కాబట్టి, ప్రాంతీయ పార్టీలను ముందు వరుసలో మోహరిస్తే చాలు కదా. ఉత్తరప్రదేశ్ లో ఆ మధ్య జరిగిన రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ… రాష్ట్రాలవారీగా భాజపాను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహరచనకు ఇప్పుడు అవకాశం ఉంది. మరి, దీన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.