ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఒకరి ఇమేజ్ డ్యామేజ్ వ్యవహారాల మీదనే నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి బెంగుళూరు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి.. ముందు వెళ్లాలా ..? వద్దా..? అన్న డైలామలో ఉండిపోయారు. కానీ బీజేపీని.. ముఖ్యంగా… మోదీని ఢీకొట్టాలంటే… ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు. పైగా… ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుకు జాతీయ రాజకీయాల్లో అనూహ్యమైన ప్రాధాన్యత లభిస్తోంది. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చంద్రబాబు చెబుతున్నా.. జాతీయ మీడియా మాత్రం… బీజేపీని ఢీకొట్టడానికి ఆయన ఓ కూటమి సెట్ చేసేశారని చెబుతూ వస్తోంది. చంద్రబాబు చేశారో లేదో కానీ…బెంగుళూరులో మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి ఖాయమనేలా… ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏకతా రాగం వినిపించారు.
ఈ వేడుకలోచంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఆటోమేటిక్‌గా… అక్కడ రాహుల్ , సోనియా కూడా ఉన్నారు. రాహుల్ తిరిగి వెళ్లేటప్పుడు.. చంద్రబాబు పక్కనే ఉన్నారు. వెళ్తూ వెళ్తూ చంద్రబాబు రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. చిన్నవాడు కాబట్టి… చంద్రబాబు రాహుల్ భుజం తట్టారు. ఇందులో రాజకీయం లేదు. పలకరింపు మాత్రమే ఉంది. కానీ దీనికే.. కాంగ్రెస్‌తో టీడీపీకి ముడిపెట్టేసి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. బీజేపీ నేతలు వీరికి జత కూడారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో లేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. జాతీయ స్థాయిలో అవసరం ఏదైనా ఉంటే.. అది ఎన్నికల సమీకరణాలను బట్టి తీసుకుంటారు కానీ.. ఇప్పుడు కావాలని ఆ పార్టీకి దగ్గరవ్వాల్సిన అవసరం లేదు.
కాంగ్రెస్ పార్టీపై ఉన్న కోపం అంతా.. ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు మరల్చారు. అప్పుడు కాంగ్రెస్ ఏపీని విడదీస్తే… ఇప్పుడు బీజేపీ నమ్మించి మోసం చేసిందని ప్రజల భావన. నిజానికి ఏపీలో బీజేపీకి ఏమీ లేదు. పోయేది కూడా ఏమీ లేదు. కానీ.. కారణాలేమైనా కానీ.. బీజేపీతో సన్నిహితంగా మెలిగేందు..మోదీని కాకా పట్టేందుకు వైసీపీ నేతలు.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోదీని విమర్శిస్తే ప్రివిలేజ్ నోటీసులిస్తున్నారు. పాద నమస్కారాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏపీకి అసలు మోదీ అన్యాయమే చేయలేదని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ ఎదురుగా వస్తే.. భుజం తడితేనే… వైసీపీ నేతలు.. విమర్శలు ప్రారంభించారు. ఏవేవో ఊహించుకుని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా.. కూటమి ఏర్పాటు చేసి.. మోదీ ఓటమి చూడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత అయినా ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకున్నా… కాంగ్రెస్ మద్దతు లేకుండా..బీజేపీని దింపేయడం అసాధ్యం. ఈ ముందస్తు ఈక్వేషన్స్ పెట్టుకునే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. కానీ నేరుగా కాంగ్రెస్‌తో సంబంధాలు ఆయన పెట్టుకునే చాన్సే లేదు. ఎప్పుడో అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను ఇప్పుడు బూచిగా చూపి..చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు మోసం చేస్తున్న వైసీపీతో చెట్టాపట్టాలేసుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటుందో.. ఎవరికీ అర్థం కాని రాజకీయం.