అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు మహిళా తహసిల్దార్లని, పోలీస్ అధికారులని పట్టుకొని చెంపలు పగులకొట్టేస్తుంటే, ప్రతిపక్ష నేతలు విమానాశ్రయంలో మేనేజరుని చితకబాదితే అదీ పెద్ద తప్పేనా…ఆ మాత్రం దానికే అరెస్ట్ చేసేసి జైల్లో వేసేస్తారా? అప్పుడెప్పుడో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయని సమైక్యాంద్ర కోసం ఉద్యమాలు చేస్తే, ఇప్పుడు పట్టుకొని కేసులు పెడితే ఏమనుకోవాలి…రాజకీయ కక్ష సాధింపు కదా? కదా ఏమిటి అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటు రాజకీయ కక్ష సాధింపు క్రిందే వస్తుంది.
ఒకప్పుడు జగనన్న ప్రజల కిచ్చిన మాట కోసం చెంచల్ గూడా జైలుకి వెళ్లి కూర్చొన్నారు. అది రాజకీయ కక్ష సాధింపేనని.. ఆయన తల్లి, చెల్లీ ఊరూరా తిరిగి ప్రజలందరికీ నచ్చజెప్పితే కానీ వెర్రిజనాలు నమ్మలేదు. అప్పుడు వైకాపాలో చేరదలచుకొన్న వారందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా లోపలకి వెళ్లి పార్టీ కండువాలు తెచ్చుకోవలసి వచ్చేది. జగనన్నని నిత్యం తిట్టిపోసిన దాడి వీరభద్రరావు మాష్టారుకి కూడా లోపలకి వెళ్లి వైకాపా కండువా కప్పుకోగానే జ్ఞానోదయం అయ్యింది. ఇంతకాలం జగనన్నని అపార్ధం చేసుకొన్నానని…కానీ ఆయన ప్రజల కిచ్చినమాట కోసమే జైలుకి వెళ్ళారని, ఆయన లోపల ఉన్నా కూడా బెయిలు గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న జనాల గురించే బాధపడుతున్నరనే ఎవరికీ తెలియని రహస్యాన్ని ఆయన బయటకు రాగానే బయటపెట్టేసారు. కానీ 2014 ఎన్నికల తరువాత ఆయనకి జగనన్న మళ్ళీ విలన్ కనిపించారు. అది వేరే విషయం.
ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీకి మూడు నెలలు శలవు పెట్టి ఫారిన్ వెళ్లి వ్యక్తిత్వ వికాసం కోర్సు, లోకజ్ఞానం, మోడీని ఎదిరించే దైర్యం వంటి వాటిలో శిక్షణ తీసుకొని వచ్చిన యువరాజావారు కూడా జైలుకి వెళ్లివస్తే ఎన్ని లాభాలు ఉంటాయో గ్రహించారో ఏమో తెలీదు కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో ‘మమ్మీ’ రాకపోయినా ఒక్కరే జైలుకి వెళ్ళిపోవాలని చాలా ఉబలాటపడినట్లు టాక్ వినిపించింది. కానీ లోపల అంత కంఫర్టబుల్ గా ఉండదని, టైమ్ కి సూపులు,సలాడులు, ఆరెంజ్ జ్యూసులు, బర్గర్లు వగైరాలు ఇవ్వరని ఎవరో చెప్పడంతో లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయారు. లేకుంటే కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేయనవసరం లేకుండానే, మోడీని తిట్టకుండానే ఆయనకీ బోలెడు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేది. కానీ డేరింగ్ చేయలేకపోవడంతో ఆ చాన్స్ కోల్పోయారు పాపం.
ఇక ఒకప్పుడు లోపల ఉన్న జగనన్నే ఇప్పుడు స్వయంగా నెల్లూరు జైలులోకి వెళ్లి అక్కడ ఈ రాజకీయ కక్ష సాధింపు బాధితులయిన తన ఎంపి మిదున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నేత బియ్యపు మదుసూదనరెడ్డిలను ఓదార్చి వచ్చేరు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అనే ఫార్ములా ప్రకారం ఇప్పుడు జైలుకి వెళ్లివచ్చినోళ్ళు అందరూ ఇప్పుడు చాలా గొప్పోళ్ళు…పులిబిడ్డలు…జననేతలుగా ప్రత్యేక గౌరవం అందుకొంటున్నారు. అందుకు జగనన్న..రేవంత్ రెడ్డే గొప్ప సజీవ సాక్ష్యాలు. అటువంటి గొప్పగొప్ప వాళ్ళు మన రాష్ట్రంలో…దేశంలో ఇంకా చాలా మందే ఉన్నారు. అది మనకి చాలా గర్వ కారణం.
ఒకసారి జైలుకి వెళ్లివస్తే చాలు..ఇక రకరకాల బిరుదులు, వాటితో బాటే ఒక్కోసారి పదవులు, అధికారం కూడా వచ్చి ఒళ్ళో వాలుపడుతుంటాయి. ఈ విషయంలో ఎవరికయినా డౌట్ ఉంటే జయలలిత, కనిమోలి, లాలూ ప్రసాద్ యాదవ్, అక్బరుద్దీన్ ఒవైసీ లాంటివారిని అడగొచ్చును. కానీ జైలుకి వెళినప్పుడు అది రాజకీయ కక్ష సాధింపు అని బయట ఉన్నవాళ్ళు గట్టిగా నొక్కి చెపాల్సి ఉంటుంది. లేకపోతే ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకట రమణలాగ అన్యాయం అయిపోతారు. ఏ ప్రత్యేక గౌరవానికి నోచుకోరు.
కనుక జగనన్న కూడా ఇప్పుడు జైల్లో ఉన్న తన నేతలను కలిసి వచ్చిన తరువాత వారు కూడా రాజకీయ కక్ష సాధింపు భాదితులేనని అనౌన్స్ చేసేసారు. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ లని ప్రశ్నించినందుకే వాళ్ళందరినీ జైల్లో వేసారని, కనుక అది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు పద్దులోకే వస్తుందని తేల్చి చెప్పారు. కనుక లోపల ఉన్నవాళ్ళు ఇక నిశ్చింతగా బెయిల్ ఏర్పాట్లు చేసుకొని బయటకు వచ్చేయవచ్చును. బయటకి వస్తే వారికి పూల దండలు వేసి, బాజా బజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళుతుంటే..వాళ్ళు రెండు వేళ్ళతో విక్టరీ సంకేతాలు ఇస్తూ..రెండు చేతులతో జోడించి దణ్ణాలు పెడుతూ ముందుకు సాగవచ్చును. గర్వంతో గుండెలుప్పొంగిపోతుంటే “చివరికి ధర్మమే గెలిచింది” అని మీడియాకు చెప్పుకొనే వెసులుబాటు ఉంటుంది.