కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీల కలయిక దేశానికి అవసరం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటనతో కూటమికి తెరలేపారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పులు తీసుకొస్తామన్నారు. అదే ఊపులో మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ లతో చర్చలు జరిపారు. అందరితో కలిసి ఒక కామన్ అజెండా తయారు చేసి, దాన్ని ప్రజలు ముందుంచి, దానికి అనుకూలంగా వచ్చే పార్టీలను కలుపుకుంటూ పోతామన్నారు. అయితే, ఇది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న రాజకీయ కూటమి కాదన్నారు. సామాన్యుల కూటమి, రైతుల కూటమి, పేదల కూటమి… అంటూ వల్లించారు. ఎన్ని మాట్లాడుకున్నా ఆదర్శాలను ఆచరణలో పెట్టాలంటే రాజకీయాల్లో అధికార సాధనే ముందుగా జరగాల్సింది. కూటమి ఏర్పాట్లో కేసీఆర్ మొదట్నుంచీ, కాంగ్రెసేతర భాజపాయేతర అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే… తరువాత చూద్దాం అంటూ పక్కనేశారు. ఇప్పుడు ఆ అస్పష్టతే కేసీఆర్ కలలకు పెద్ద సవాల్ గా మారుతోంది.
రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకించే అవసరం దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలకు లేదన్నది నిన్నటి బెంగళూరు పరిణామాలు కేసీఆర్ స్పష్టం చేసినట్టే. ఆ రెండు పార్టీలకూ సమాన దూరం పాటిస్తారనుకుని కేసీఆర్ ఆశించి కలిసిన నేతలు కూడా బెంగళూరులో కాంగ్రెస్ తో కలిసిమెలిసి కనిపించారు. ఇంకా చెప్పాలంటే మరింత బలంగా కనిపించారు. దాదాపు 14 పార్టీలు ఒక వేదిక మీదికి వచ్చాయి. జాతీయ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఈ వరుసలో నిలబడలేకపోయారు. ఒకరోజు ముందుగానే బెంగళూరు వెళ్లొచ్చేసి రాష్ట్ర స్థాయిలో విమర్శలకు చెక్ పెట్టుకుని వచ్చారు. రాష్ట్రం వరకూ ఇది వ్యూహత్మక చర్యే. కానీ, తన జాతీయ రాజకీయ కలల మాటేమిటి అనేదే ఇప్పుడు ప్రశ్న..?
ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా ఇకపై కేసీఆర్ వ్యూహం ఏంటనేది ప్రశ్న? ఇకపై ఎవరిని కలిసేందుకు కేసీఆర్ వెళ్లారనేదీ ప్రశ్నే..? ఎందుకంటే, కీలకమైన ప్రాంతీయ పార్టీలన్నీ బెంగళూరులో పేరేడ్ చేశారు. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఒక వేదిక మీదికి దాదాపుగా వచ్చినట్టు కనిపించాయి. కేసీఆర్ కలిసిన, కేసీఆర్ పిలిచిన నేతలు కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఇకపై కేసీఆర్ తన స్టాండర్డ్ వాదనతో కలవబోయే నాయకులు ఎవరు అనేది పెద్ద ప్రశ్న..? అలాగని, ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా తాను బిగించుకున్న చట్రం నుంచి బయటకి రాలేని సందిగ్ధత. ఫ్రెంట్ ఆలోచనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.