బెంగుళూరులో ప్రాంతీయ పార్టీల నేతలతో జరిపిన చర్చల్లో కూటమి అవసరాన్ని దాదాపు అన్ని పార్టీల నేతలూ అంగీకరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలంటూ… తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా చంద్రబాబును కోరారు. దీనికి చంద్రబాబు అంగీకరించినట్లే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రాష్ట్ర సమస్యలపై పోరాటానికి..మరో వైపు రాజకీయంగానూ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో … ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దీని కోసం… ఆయా రాష్ట్రాలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు.
త్వరలోనే చంద్రబాబు రాష్ట్రాల పర్యటనల షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. కేంద్రానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న బెంగాల్, కేరళ,ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకు ముందుగా చంద్రబాబు వెళతారు. వారికి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించి… పార్లమెంట్‌తో పాటు కేంద్రంపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతు అడుగుతారు. ఆ పోరాటంలో కలసి రావాలని కోరుతారు. ఇక అధికారంలో లేకపోయినా బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్న ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాల నేతలనూ చంద్రబాబు ప్రత్యేకంగా కలవనున్నారు. అంతే కాకుండా..అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో పొత్తుల్లేని పార్టీలతో అమరావతిలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే.. అమరావతిలో నిర్వహించబోయే ధర్మపోరాట సభలో… ఈ ప్రాంతీయ పార్టీల కూటమికి ఓ రూపు ఇచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో చిన్న అవకాశం దొరికితే.. అల్లుకుపోయే చంద్రబాబుకు… ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి చాలా అస్త్రాలు దొరికాయి. ఒకటి ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం అయితే.. పదిహేనో అర్థకి సంఘం విధివిధానాలు మరొకటి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ పదిహేనో అర్థికసంఘం విధివిధానాలపై భగ్గుమంటున్నాయి. మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండింటి కేంద్రంగా.. నరేంద్రమోదీపై కూటమిని ఎక్కు పెట్టడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు.