విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మిస్తున్న సినిమా ‘గీత గోవిందం’. అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ తీసిన పరశురామ్ ఈ సినిమాకి దర్శకుడు. ఇందులో ‘ఛలో’ ఫేమ్ రష్మిక హీరోయిన్. అలాగే, అనూ ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర చేస్తున్నదనే వార్త బయటకు వచ్చింది. ఇంకా ఆమె షూటింగ్ స్టార్ట్ చేయలేదు, అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు. అయితే… దాదాపుగా అను నటించడం ఖాయమే. ఆమె ఈ పాత్ర అంగీకరించడం వెనుక అల్లు అర్జున్ రిక్వెస్ట్ వుందని సమాచారం. ‘ఆక్సిజన్’, ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’ సినిమాల తరవాత అనూ ఇమ్మాన్యుయేల్‌కి భారీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు చేసింది. అయితే… అవేవీ హిట్స్ కాలేదు. పైగా, ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేశాయి. ఈ టైమ్‌లో అతిథి పాత్ర చేస్తే… కెరీర్‌కి రిస్క్ అని మొదట అనూ ‘గీత గోవిందం’ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. అయితే… అల్లు అర్జున్ రంగంలోకి దిగడంతో చివరకు ఒప్పుకున్నార్ట. ప్రస్తుతం నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’లో నటిస్తున్నారామె.