జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో నిరాహారదీక్షను చేర్చారు. మూడు రోజుల కిందట… పలాసలో కిడ్నీ రోగులతో సమావేశమై.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..వారిని ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు. రెండు రోజుల్లో ఆరోగ్యమంత్రిని నియమించి… బాధితులకు సాయం చేయకపోతే.. శ్రీకాకులంలో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ ప్రకటనను ప్రభుత్వం లైట్ తీసుకుంది. పెద్దగా పట్టించుకోలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఇరవై నాలుగు గంటల నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన టెక్కలి సమీపంలో ఉన్న దాట్ల రిసార్ట్స్ లో బస చేశారు. శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన అందులోనే నిరాహారదీక్ష చేస్తారని జనసేనవర్గాలు ప్రకటించాయి.
వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేరన్న కారణంతో గురు,శుక్రవారాలు ఆయన యాత్రకు విరామం ఇచ్చారు. శనివారం యథావిధిగా పోరాటయాత్ర ఉంటుందని జనసేనవర్గాలు ప్రకటించాయి.ఇంతలోనే హఠాత్తుగా… శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచే నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో శనివారం కూడా పోరాటయాత్ర వాయిదా పడినట్లయింది. ఐదు గంటలకు నిరాహారదీక్ష ప్రారంభించినా దాట్ల రిసార్ట్స్ లోపలకు మీడియాను అనుమతించడం లేదు. జనసేన మీడియా విభాగమే ఫోటోలు, వీడియోలు పంపిస్తుందని..మీడియాకు సమాచారం పంపారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు మాత్రం.. రిసార్ట్స్ బయటకు వచ్చి.. కిడ్నీబాధితులు. మరికొంత మంది ప్రజల సమక్షంలో దీక్షలో కూర్చుకుంటారు. ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది.ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
నిజానికి పవన్ కల్యాణ్ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన తర్వాత మంత్రి లోకేష్ స్పందించారు. తాము ఏమేం చేశామో.. వివరంగా ట్వీట్ చేశారు. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణంగా భావిస్తున్న నీటి సమస్యను తీర్చడమే కాకుండా.. రోగులకు పెన్షన్లు, ఉచితంగా డయాలసిస్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పవన్ కు తప్పుడు సమాచారం అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఓ సారి ఉద్దానంకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెక్ చేసుకోవాలని ట్వీట్ చేశారు. లోకేష్ వివరణపైనా.. దీక్ష తర్వాత పవన్ కల్యాణ్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.