దక్షిణాది రాష్ట్రాల్లో బలపడతాం, కర్ణాటకలో గతం కంటే తమకు పెరిగిన ఓటింగ్ శాతమే ఇందుకు సాక్ష్యం అని భాజపా చాటింపు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నరేంద్ర మోడీపై దక్షిణాదిన తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందంటూ లోక్ నీతి, సీఎస్డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో… మోడీ పాలనపై ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. 68 శాతం ఏపీ ప్రజలు మోడీపై అసంతృప్తితో ఉన్నారనీ, కేవలం 26 శాతమే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తేల్చింది. సరిగ్గా, ఐదు నెలల క్రితం చూసుకుంటే… భాజపాపై ఆంధ్రాలో అసంతృప్తి అనేది 52 శాతం మాత్రమే ఉండేది. అంటే, ఎన్డీయే నుంచి అధికార పార్టీ బయటకి వచ్చిన తరువాత ఏపీలో అసంతృప్తి అధికమైందని సర్వే తేల్చింది. ఏడాది కిందట, 2017 మే నాటికి మోడీపై అసంతృప్తి శాతం 38 మాత్రమే ఉండేది. అంటే, గడచిన ఏడాదిలో మారిన తీరు ఎలా ఉందో సర్వే చెప్పకనే చెబుతోంది.
మోడీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నంబర్ వన్ రాష్ట్రం తమిళనాడు. అక్కడ 75 శాతం మంది సంతృప్తిగా లేరు. తరువాతి స్థానంలో ఆంధ్రా, మూడో స్థానంలో 64 శాతంతో కేరళ, ఆ తరువాత తెలంగాణ 63 శాతంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా మోడీ వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోందని సర్వే చెప్పింది. ఐదు రాష్ట్రాల్లో కలుపుకుంటే, ప్రస్తుతం భాజపాకి ఉన్న ఓట్లు కేవలం 17 శాతం కావడం గమనార్హం. సౌత్ ఇండియాలో గత జనవరి తరువాతే భాజపా గ్రాఫ్ పడిపోవడం మొదలైంది.
ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, దీంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి రావడమే కారణమని సర్వే చెప్పింది. ఆ తరువాత, ఏపీలో టీడీపీ బలం అనూహ్యంగా పెరిగిందనీ, దీంతోపాటు తెలంగాణలో తెరాస, తమిళనాడులో డీఎంకే, కర్ణాటకలో జేడీఎస్, కర్ణాటకలో కమ్యూనిస్టులు కూడా గత ఐదు నెలల్లో గణనీయంగా మద్దతు పెంచుకున్నాయని నివేదిక చెప్తోంది. ఇక, జాతీయస్థాయిలో తీసుకుంటే దాదాపు సగం, అంటే 47 శాతం మంది ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని చాలా స్పష్టంగా సర్వే తేల్చిచెప్పింది.
ఎన్నికలకు ఏడాది ముందు మోడీ పాలనపై దేశంలో వ్యక్తమౌతున్న అసంతృప్తి ఈ స్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. టీడీపీతో పొత్తు తెంచుకున్నాక.. ఆంధ్రాలో అనూహ్యంగా బలపడుతున్నామని ఏపీ భాజపా నేతలు ఎప్పటికప్పుడు చెబుతుంటారు. కానీ, సరిగ్గా అప్పట్నుంచే భాజపాపై ఆంధ్రాతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత మరింత పెరిగిందన్న వాస్తవాన్ని ఈ సర్వే కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.