జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో విచిత్రమైన రాజకీయ కార్యక్రమం చేపట్టారు. అదే కొంత ఆజ్ఞాత నిరాహార దీక్ష – మరికొంత ప్రజల మధ్య నిరాహారదీక్ష. నిజానికి ఎవరైనా రాజకీయా నాయకుడు దీక్ష చేయాలంటే.. చాలా హంగామా చేసి.. ఎవరి కోసమైతే.. ఆహారం మానేయాలనుకంటున్నాడో.. వారిని కూడగట్టుకుని పోరాటం చేస్తారు. కానీ జనసేన అధినేత మాత్రం కొత్త సంప్రదాయాన్ని ప్రారభించారు. నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఎచ్చెర్ల దగ్గర ఆయన బస చేసిన దాట్ల రిసార్టులో నిరాహారదీక్ష ప్రారంచారని.. జనసేన మీడియాకు సమాచారం ఇచ్చింది. రిసార్టులోకి మీడియాను అనుమతించబోమని.. కావాలంటే ఫోటోలు,వీడియోలు మీడియాకు పంపుతామని చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే కొన్ని ఫోటోలు మీడియాకు రిలీజ్ చేశారు. అందులో పవన్ దీక్ష చేస్తున్నారో.. లేక రిలాక్స్ అవుతున్నారో… అర్థం అయినట్లు.. కానట్లు ఉంది. ప్లాస్టిక్ చెయిర్లో కూర్చుని.. పుస్తకం చదువుకుంటూ దీక్ష చేస్తున్నారు.
దీని వల్ల వచ్చే ఉపయోగం ఎంతో కానీ… ఇతర పార్టీల నేతల విమర్శల వల్ల పోయే క్రెడిబులిటీనే ఎక్కువ. రాజకీయ నాయకులు నిరాహారదీక్షలు ఎందుకు చేస్తారో.. పవన్ కల్యాణ్‌కు పూర్తిగా అవగాహన లేపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని.. జనసేనలోని కొంత మంది నేతలు చెప్పుకొస్తున్నారు. కానీ వారు పవన్ కల్యాణ్ కు సలహాలిచ్చేంతటి వారు కాదు. నిజానికి పవన్ కల్యాణ్ ఇరవై నాలుగు గంటల దీక్ష చేపట్టాలనుకుంటే.. బహిరంగంగా చేస్తే వచ్చే నష్టమేంటో..ఎవరికీ అర్థం కావడం లేదు. పద్దెనిమిది గంటలు ఆజ్ఞాతంలో రిసార్టులో చేస్తానని..ఎనిమిది గంటలు.. ప్రజల మధ్య చేస్తాననడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు అవకాశం ఇచ్చినట్లయింది. కిడ్నీ బాధితులు, ప్రజల మధ్య చేయాలనుకుంటే.. ఆ నైన్ టు ఫైవ్ దీక్షే చేస్తే సరిపోయేది. ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కాదు.
నిజానికి జనసేనలో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం.. పవన్ కల్యాణ్ అలవాటులో ఆవేశంగా నిరాహారదీక్ష ప్రకటన చేశారు. నిజానికి ఈ విషయంలో ఆయన ఎలాంటి ప్రణాళికతో లేరు. గతంలో పవన్ కల్యాణ్ ఏ డిమాండ్ చేసి డెడ్ లైన్ పెట్టినా.. ప్రభుత్వం అంతో ఇంతో స్పందించేది. కారణం అప్పుడు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు సున్నం పెట్టుకున్నారు కాబట్టి.. పంతానికైనా ప్రభుత్వం స్పందించదు. కానీ.. లోకేష్ మాత్రం.. ఉద్దానంకు ఏమేమీ చేశారో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పవన్ క్లారిటీగా చేసిన డిమాండ్ .. ఆరోగ్యమంత్రిని నియమించడం ఒక్కటే. పవన్ చెబితే… ఆరోగ్యమంత్రిని ఉన్న పళంగా నియమించే పరిస్థితిలో టీడీపీ అధినేత ఉండరు. అయినా ఇలాంటి విషయాల్లో నిరాహారదీక్ష చాలెంజ్ లు చేయకూడదని పవన్ కు చెప్పేవారే లేరు.
గతంలో పలుమార్లు ఇలాంటి నిరాహారదీక్ష ప్రటనలు చేసి ఉండటం.. ఈ సారి దీక్ష చేయకపోతే… తన ప్రకటన్లో సీరియస్ నెస్ పోతుందన్న … వ్యూహకర్తల సూచనల మేరకే పవన్ కల్యాణ్ హడావుడిగా దీక్ష నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ప్లాన్ కూడా… తలకిందులుగా అమలు చేస్తున్నారు. దీని వల్ల జనసేనకు వచ్చే లాభం కన్నా… జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది.