హీరోగా ఫెయిల్ అయ్యాడు. యాక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ గా అయితే ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా సరే అతనికి అవకాశాలు వస్తున్నాయంటే…. అతని తండ్రికి గల పేరు ప్రఖ్యాతులు.. తద్వారా ఏర్పడిన పరిచయాలే కారణం.
ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి ‘నీతో’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తదుపరి ‘మార్నింగ్ రాగ’ అనే చిత్రంలో నటిస్తూ నిర్మించాడు. ఆ తర్వాత.. ‘బొమ్మలాట, అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో’ చిత్రాలు తీశాడు. వీటిలో ఏ ఒక్కటితోనూ అతనికి విజయాలు రాలేదు.
అయినా సరే.. బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేజిక్కించుకోగలిగాడు. ఆ సినిమా పేరు ‘మెంటల్ క్యా హై?
సెక్స్ ని నమ్ముకొని సినిమాలు తీసి కోట్లు గడించడంలో సిద్ధ హస్తురాలయిన ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘మెంటల్ క్యా హై’ పై ప్రకాష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్ పరంగా అతనికిది జీవన్మరణ సమస్యలాంటిది. అందుకే తన శక్తియుక్తులన్నీ ఈ సినిమాపై పెడుతున్నాడు.
కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు, అమైరా దస్తూర్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. టైటిల్ పరంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘మెంటల్’ పేరుతొ ఓ సినిమా చేయాలని అనుకోవడం అందుకు కారణం. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. అయితే.. ఎందుకనో కుదరలేదు. మరి ‘మెంటల్ క్యా హై’ తోనైనా ప్రకాష్ కోవెలమూడి మెస్మరైజ్ చేస్తాడేమో చూడాలి.
అన్నట్లు.. ‘సెక్స్ సెల్స్’ అనే సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న ఏక్తా కపూర్ తాజాగా నిర్మించిన ‘వీర్ డి వెడ్డింగ్’ త్వరలోనే విడుదల కానుంది. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ తదితరులు నటించిన ఈ చిత్రం… ట్రైలర్ లో ఉన్న బూతు డైలాగులు పుణ్యమా అని ఎంత పాపులర్ అయ్యిందీ తెలిసిందే!!