ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు క్రిష్ చేతికి అందడం దాదాపుగా లాంఛనమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. బాలయ్య నుంచి ఓ అధికారిక ప్రకటన రానుంది. ఆరోజున.. విద్యాబాలన్ ఎంట్రీ గురించి కూడా ఓ స్పష్టత వస్తోంది. ఈ సంక్రాంతికి ఎలాగైనా సరే, ఈ సినిమాని విడుదల చేయాలన్నది బాలయ్య ఆలోచన. అయితే.. క్రిష్ వైఖరి చూస్తుంటే సంక్రాంతికి రావడం కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే `ఎన్టీఆర్` స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఆ స్క్రిప్టు ఆసాంతం చదివిన క్రిష్.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నాడట. `స్క్రిప్టుని తిరగరాయాలి.. దానికి కొంచెం సమయం కావాలి` అని బాలయ్యని క్రిష్ అడిగినట్టు, బాలయ్య కూడా దానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కథలో ఏమైతే ఉండాలని ప్రేక్షకులు, అభిమానులూ భావిస్తారో, అవన్నీ ఈ కథలో ఉండేలా క్రిష్ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. కొన్ని వివాదాస్పద అంశాల్ని సైతం `లైట్`గా టచ్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాడట. అంతే కాదు.. 2 భాగాలు అనుకున్న ఈ కథని ఒకే సినిమాగా మలచాల్సి వస్తోంది. అందుకే స్క్రిప్టు పరంగా మరింత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తోంది. సో.. ఎన్టీఆర్ స్క్రిప్టులో మరిన్ని కీలకమైన మార్పులు చూడబోతున్నామన్నమాట.