పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం దీక్ష చేశారు. ఆయనకు మద్దతుగా జిల్లాల్లో కొన్ని చోట్ల అభిమానులు కూడా… దీక్షలు చేశారు. ఇందులో విశేషం ఏమీ కాదు.. కానీ రాజమండ్రిలో జనసేన తరపున వేసిన ఓ దీక్షా టెంటులో ఉన్న వారిని చూసి అక్కడ జనం కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆమె రాజమండ్రి సిటీ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య లక్ష్మీపద్మావతి. పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతుగా దీక్ష చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. తన దీక్షకు .. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. కానీ ఆమెతో పాటు కూర్చున్న వాళ్లంతా.. ఆకుల సత్యనారాయణ అనుచరులే.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ – జనసేన మధ్య రహస్య స్నహం ఉందని టీడీపీ నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇది నిజమని లెఫ్ట్ పార్టీల నేతలు నమ్మడం లేదు. లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు శ్రీకాకుళం వెళ్లి పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపారు. బీజేపీ తరపున నేరుగా మద్దతు ప్రకటించలేక..ఇలా భార్యతో జనసేన కండువాలను మెడలో వేయించి.. ఎమ్మెల్యేనే దీక్ష చేయిస్తున్నారన్న చర్చలు రాజమండ్రిలో జరుగుతున్నాయి. అదేం కాదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తెలిసిందే కాబట్టి… ముందు జాగ్రత్తగా ఆకుల సత్యనారాయణ జనసేనలో కర్చిఫ్ వేస్తున్నారని మరికొంత మంది చెబుతున్నారు. కొంత వరకు ఇదే వాస్తవం కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కన్నాకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆకుల సత్యనారాయణ అసంతృప్తిలో ఉన్నారు. పదవి రాకపోగా.. పొత్తుల్లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమన్న అంచనాలున్నాయి.
అందుకే ఆకుల ప్లాన్డ్ గా.. జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై క్లారిటీ లేదు కాబట్టి.. ఎందుకైనా మంచిదని..కొన్ని ఆప్షన్లను ఆయన రెడీ చేసి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ బీజేపీ అగ్రనేతలు మాత్రం… వైసీపీతో పొత్తు ఉంటుందన్న సూచనలు క్యాడర్ కు పంపుతున్నారు. వైసీపీలో విజయసాయిరెడ్డి వంటి నేతలు కూడా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటన్నట్లుగా మాట్లాడుతున్నారు. పొత్తు ఉంటే సిట్టింగ్ సీటుగా రాజమండ్రి నుంచి పోటీ చేయవచ్చు..లేకపోతే జనసేన తరపున పోటీ చేయవచ్చన్న ఆలోచనలో .. ఆకుల సత్యనారాయణ భార్యను రాజకీయంలోకి తెచ్చినట్లు భావిస్తున్నారు.