కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఇప్పటివరకూ రేవంత్ రెడ్డికి ఆశించిన గుర్తింపు రాలేదు. అదిగో ఇదిగో అంటూనే రోజులు గడిచిపోతున్నా… పార్టీలో ఆయనకి దక్కబోయే కీలక బాధ్యత ఏంటనే స్పష్టత నిన్నమొన్నటి వరకూ రాలేదు. అయితే, ఈ మధ్య రేవంత్ కాస్త అలకబూనడం, తన వర్గాన్ని పార్టీలో అడ్డుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు… వెరసి ఆయన హైకమాండ్ కి టచ్ లోకి వెళ్లడం జరిగాయి. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా రేవంత్ కి బాధ్యతలు అప్పగిస్తారన్న కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రేవంత్ వర్గానికి కూడా గుర్తింపు దక్కబోతోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రేవంత్ అనుచరుల్లో క్రియాశీలంగా ఉన్నవారిని గుర్తించీ, వారి జాబితాను సిద్ధం చేయాలంటూ ఇప్పటికే పీసీసీకి ఆదేశాలు అందినట్టు చర్చ జరుగుతోంది.
నిజానికి, కొద్దిరోజుల కిందటే తనతోపాటు పార్టీలోకి వచ్చిన వారికి వివిధ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ ఓ జాబితా సిద్ధం చేశారు. అయితే, దాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించకుండా ఉత్తమ్ తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో రేవంత్ కూడా మౌనం దాల్చడం, కొన్నాళ్లపాటు కొడంగల్ కే పరిమితం అవుతున్నారంటూ సంకేతాలు ఇవ్వడం జరిగింది. కానీ, ఇప్పుడా వర్గానికి ప్రాధాన్యత దక్కేలా రేవంత్ చేసుకోగలిగారని చెప్పొచ్చు. ఇప్పటికే, సీతక్కని నేరుగా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. మిగతా కీలక నేతలకు కూడా ఏఐసీసీ కార్యవర్గ స్థాయి పదవులు దక్కబోతున్నట్టు సమాచారం. ఒకవేళ అక్కడ అవకాశం దక్కనివారికి పీసీసీ స్థాయిలోనైనా గుర్తింపు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిందట.
మొత్తానికి, కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రేవంత్ అనుకున్నది సాధించుకున్నట్టుగానే చెప్పొచ్చు. తనతోపాటు తన వర్గానికి కూడా పదవులు దక్కించుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే, రేవంత్ పై ఇప్పటికే గుర్రుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల స్పందన ఇప్పుడెలా మారుతుందనేదే ప్రశ్న..? రేవంత్ కి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చేస్తే.. ఆయన రంగంలోకి దిగడం ఖాయం. బస్సుయాత్రల్లో ఆయనకి వస్తున్న స్పందన ఎలా ఉంటుందో ఇతర నేతలకు బాగా తెలుసు. ఇక, రేవంత్ మనస్ఫూర్తిగా ప్రచారంలోకి దిగితే పరిస్థితి మరోలా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ల స్పందనలు ఎలా మారతాయో చూడాలి..! రేవంత్ తోపాటు, ఆయన వర్గానికి పార్టీ అధినాయకత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని భావించేవారూ కాంగ్రెస్ లో ఉండరని అనుకోలేం కదా.